తెలంగాణలో 17 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. రేపటి నుంచి మార్చి 02 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర చేపట్టనుంది. తెలంగాణను 5 క్లస్టర్లుగా విభజించిన బీజేపీ 114 అసెంబ్లీ, 17 ఎంపీ స్థానాల్లో రథయాత్రలు, 106 సమావేశాలు, 102 రోడ్డు షోలు నిర్వహించనుంది. తాజాగా బీజేపీ విజయ సంకల్ప యాత్ర స్టిక్కర్స్, పోస్టర్, పాటను విడుదల చేశారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తెలంగాణకు ఇక బీఆర్ఎస్ పార్టీ అవసరం లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల మాదిరిగా చీకటి రాజకీయాలు మేము చేయమని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్‌తో పొత్తు ఉండదని కిషన్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పారు. కాగా, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయని గత కొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. పొత్తు వార్తలపై ఆదివారమే క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి.. ఇవాళ మరోసారి బీఆర్ఎస్‌తో ఎట్టి పరిస్థితుల్లో పొత్తు ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చారు.