సాధారణంగా కొత్త అళ్లుళ్లకు మర్యాదలు చేయాలన్నా.. వెటకారం చేయాలన్నా ఉభయ గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఇక సంక్రాంతి పండుగ సమయంలో గోదావరి జిల్లాలోని ఏ ఇంటికి అయినా కొత్త అల్లుడు వెళ్తుంటారు. ఇంటికి వచ్చిన అల్లుడు ఆ మర్యాదలకు వెజ్, నాన్ వెజ్, పిండి వంటల రుచులకు ఫిదా అవ్వాల్సిందే. వందలాది రకాల రుచులను ఆస్వాదించలేక భక్తాయాసంతో గింగిరాలు తిరగాల్సిందే. ఆ సంస్కృతి, సంప్రదాయం ఈ సంక్రాంతికి తెలంగాణను సైతం చుట్టిముట్టింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో కొత్త అల్లుళ్లకు వందకు పైగా రుచులను వడ్డించి సర్ ప్రైజ్ చేశారు అత్తింటివారు.
కాకినాడకు చెందిన మల్లికార్జున్ కు హైదరాబాద్ లోని సరూర్ నగర్ కు చెందిన యువతితో పెళ్లి జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణకు వచ్చిన అల్లుడికి అత్తమామ ఖమ్మంపాటి క్రాంత్-కల్పన దంపతులు పసందైన వంటలు చేసి వడ్డించారు. వెజ్, నాన్ వెజ్, స్వీట్స్, పులిహోర, పండ్లు, పిండివంటలు మొత్తం 130 రకాల వంటకాలను వడ్డించారు. అలాగే సంగారెడ్డిలోని శాంతినగర్ కు చెందిన మాజీ సర్పంచ్ మంగరాములు తన అల్లుడు, కుమార్తెను పండుగకు ఆహ్వానించి 108 రకాల వంటకాలతో విందు భోజనం వడ్డించి ఆహా అనిపించారు.