తెలంగాణ అసెంబ్లీలో నేడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. బీజేపీ కూడా అందుకు మద్దతు తెలుపుతూనే ఫ్లోర్ లీడర్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సభలో గందరగోళం నెలకొంది.
మన్మోహన్ సింగ్ స్మారక దినాలను వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నాం వెళ్ళాడని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి కౌంటర్‌గా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆయనకు చురకలు అంటించారు.కూనంనేని మాట్లాడుతూ..మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించే కార్యక్రమంలో రాజకీయాలు తగదని హితవు పలికారు.సంతాప సభల్లో వేరే అంశాలను జోడించడం ఇంతకు ముందెన్నడూ చూడలేదని, నివాళి టైంలో ఇలా చేస్తే మన్మోహన్ ఆత్మ క్షోభిస్తుందన్నారు.నివాళి టైంలో ఆయన గొప్పతనాన్ని చెప్పాలని, కేటీఆర్ లాగా చక్కగా శాసన సభ సంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పించాలన్నారు.