అమ్మమ్మ వంటతో అదిరిపోయే బిజినెస్

-

బామ్మ చేతి వంటను ఇష్టపడని వారంటూ ఉండరు. నేటి జనరేషన్​లో ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, తల్లిదండ్రులకు దూరంగా ఉద్యోగాల పేరుతో నగరాలకు షిఫ్ట్ అవ్వడం వల్ల పిల్లలు వారి బామ్మా-తాతయ్యలను మిస్ అవుతున్నారు. వారు పంచే ప్రేమకు దూరమవ్వడమే కాదు.. వారి జీవితాలకు.. వారి అనుభవాలకు.. వారు ప్రేమగా వండిపెట్టే వంటలకు కూడా దూరమవుతున్నారు. కానీ మహారాష్ట్రకు చెందిన అపూర్వ పురోహిత్​కు మాత్రం తన బామ్మతో ఎంతో మంది ఆత్మీయ సంబంధం ఉంది. అందుకే తన బామ్మ చేతి రుచిని నేటి తరానికి అందించాలనుకున్నారు. అంతేకాదు.. మనకు చేతనైనంతలో ఇతరులకు సాయపడాలని బామ్మ చిన్నప్పుడు చెప్పిన మాటలనూ అపూర్వ మరిచిపోలేదు. అందుకే బామ్మ చేతి వంటను నేటి జనరేషన్​కి అందించడంతో పాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఇంతకీ ఎవరీ అపూర్వ పురోహిత్.. ఆమె స్టోరీ ఏంటో చూద్దామా.. ?

ముంబయికి చెందిన అపూర్వ పురోహిత్ ఫుడ్ ఇండస్ట్రీలో వస్తున్న మార్పులను గమనించారు. అప్పుడే ఆమెకు తన అమ్మమ్మ వంట గుర్తొచ్చింది. తాజాగా చేసిపెట్టుకొని ఉపయోగించే మసాలాలు, ఆరోగ్యకరమైన పచ్చళ్లు ఈ కాలం వాళ్లకి దూరమవుతున్నాయనుకున్నారు. వాటిని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో 2021లో కొడుకుతో కలిసి ‘అజోల్‌’ ప్రారంభించారు. అజోల్ అంటే.. మరాఠీలో ‘అమ్మమ్మ ఇల్లు’ అని అర్థమట. అపూర్వ బీఎస్‌సీ ఫిజిక్స్‌, ఐఐఎం బెంగళూరు నుంచి మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు. వివిధ కార్పొరేట్‌ సంస్థల్లో 30 ఏళ్లు ఉద్యోగం చేశారు. సొంతంగా ఏదైనా ప్రయత్నించాలనుకున్నప్పుడు ఆమె మనసు వ్యాపారం వైపు మళ్లింది. దీనికి సమాజ సేవా జోడించాలనుకొని మహారాష్ట్రలోని స్వయం సహాయక సంఘాల వారిని చేర్చుకుంటూ వెళ్లారు.

‘పల్లెలు, గ్రామీణ ప్రాంతాల వారికి ఏమీ తెలియదు అనుకుంటారు చాలామంది. కానీ, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన ఆహారం అక్కడే దొరుకుతుంది. ఇప్పటికీ తాతల నాటి సంప్రదాయ విధానాలనే వాడుతున్నవారెందరో. ఓసారి మహారాష్ట్రలోని పల్లెకు వెళ్లినపుడు కొన్ని స్వయం సహాయక సంఘాలను చూశా. తక్కువ ఖర్చులో నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. కానీ మార్కెటింగ్‌పై అవగాహన లేక సరకు మిగిలిపోతుంది. దీనికితోడు ఇంట్లో వాళ్లు, చుట్టుపక్కల వాళ్ల నుంచి హేళన భరించాలి. అయినా భరిస్తూ ఏదో సాధించాలన్న వాళ్ల తపన నాలో స్ఫూర్తి కలిగించింది. బామ్మల రుచుల్ని అందించడంతోపాటు ఇతరులకూ ఉపాధి కల్పించే అవకాశం. బాగుందనిపించింది. దీంతో వాళ్ల ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పిస్తానని ఒప్పందం చేసుకున్నా.’ అని అపూర్వ చెప్పారు.

తక్కువ ఖర్చు, నాణ్యమైన సరకు నినాదంగా పనిచేస్తున్నామని అపూర్వ అన్నారు. ఇన్‌స్టంట్‌ చట్నీలు, పొడులు, వడియాలు, బెల్లం.. సేంద్రియ పదార్థాలతో తయారు చేసినవి మొత్తం 30కిపైగా రకాలను అమ్ముతున్నారు. అమెజాన్‌ వంటి ప్లాట్‌ఫామ్‌లతోపాటు సొంత వెబ్‌సైట్‌ ద్వారా కూడా అమ్మకాలు జరుపుతున్నారు. ఏడాదిన్నరలోనే విదేశాలకూ సరఫరా చేస్తున్నారు. దాదాపు 20 స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పిస్తున్నారీవిడ. తయారీలోనే కాదు మార్కెటింగ్‌ వంటి వివిధ విభాగాల్లోనూ మహిళలకే ప్రాధాన్యమిచ్చారు. ప్రిజర్వేటివ్‌లను అసలు వాడరు. 16 నాణ్యత పరీక్షల తర్వాతే మార్కెట్‌లోకి తెస్తామంటున్న ఈవిడ ప్రస్తుతం మహారాష్ట్ర సంప్రదాయ రుచులనే అందిస్తున్నారు. ఇతర రాష్ట్రాల రుచులనూ అందించే ప్రయత్నంలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news