ఒకానొక రాజ్యంలో ఒక ఏనుగు ఉండేది. రాజును ఎక్కించుకుని తిరిగే ఆ ఏనుగును దాని చిన్నప్పటి నుండి ఆ రాజ్యంలోనే పెంచుతున్నారు. ఏనుగుకు కావాల్సిన అన్ని ఆహారాలు సమకూరుస్తున్నారు. మావటివాడు ఏనుగు బాగోగులు చూసుకుంటూ ఉన్నాడు. అదే రాజ్యంలో ఏనుగు ఉండే కొట్టం పక్కన ఒక కుక్క ఉండేది. ఆ కుక్కకు ఏనుగుకు పెడుతున్న ఆహారాన్ని చూసి కోరిక కలిగింది. ఎలాగైనా సరే ఆ ఆహారాన్ని తినాలని అనుకుంది. వెంటనే తోక ఊపుకుంటూ ఏనుగు కొట్టంలోకి వెళ్ళి, ఏనుగు తినగా కిందపడిన ఆహారాన్ని తినసాగింది.
ఇలా రోజూ ఏనుగుకు పెట్టిన ఆహారాన్ని తింటూ ఉంది. కొన్ని రోజులకు కుక్క బాగా పెద్దదైంది. చూడడానికి ముచ్చటగా తయారైంది. రోజూ ఆహారం తినడానికి వస్తున్న కుక్కను చూసిన ఏనుగు, ఏమీ అనకుండా ఆహారాన్ని తిననిచ్చేది. దాంతో వారిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. అది పెరిగి పెరిగి విడదీయలేని బంధంగా మారింది. రోజూ కొట్టానికి రావడం, ఏనుగు తొండం మీద ఆడుకోవడం కుక్కకు అలవాటైంది.మ్
ఒకానొక రోజు దారిన వెళ్తున్న బాటసారి కొట్టంలో ఉన్న కుక్కను చూసాడు. వెంటనే దాన్ని తనతో పాటు తీసుకెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన ఏనుగు ఘీంకరించింది. కానీ ఆ ఘీంకారానికి ఎవ్వరూ స్పందించలేదు. తన స్నేహితుడు దూరమయ్యాడన్న బాధలో ఏనుగు ఏమీ తినడం లేదు. ఏడుస్తూనే ఉంటుంది. ఇలా రెండు ముడు రోజులయ్యాక, ఏనుగుకు ఏదైనా జబ్బు చేసిందేమో అని వైద్యుడుని పిలిపించారు.
ఏనుగును పరీక్షించిన వైద్యుడు, ఏనుగుకు ఎలాంటి జబ్బు లేదని, ఎవరి మీదో బెంగ పెట్టుకోవడం వల్లే ఇలా అయిందని చెప్పాడు. అప్పుడు అక్కడున్న సైనికులు కుక్కతో ఏనుగుకు ఉన్న స్నేహం గురించి వివరించారు. అంతా విన్న రాజు, రాజ్యంలో ఏనుగు వద్ద ఉన్న కుక్క ఎవ్వరి వద్ద ఉన్నా వారికి జరిమానా విధించబడుతుందని దండోరా వేయించాడు. అంతే ఆ బాటసారి కుక్కను వదిలేసాడు.
దాంతో కుక్క, ఏనుగు కొట్టంలోకి వెళ్ళిపోయింది. కుక్క రాకపట్ల ఏనుగు సంతోషంతో గంతులు వేసింది. తొండం మీద కూర్చోబెట్టుకుని అటూ ఇటూ ఊపింది. జీవితం చాలా చిన్నది. ఉన్న చిన్న జీవితంలో పగలూ, ప్రతీకారాలు అంత మంచివి కావు. శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశం ఒక్కోసారి వస్తుంది. అలాంటప్పుడు ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. డేర్ టియూ మోటివేషన్ ఆధారంగా.