తెలుగుదశం పార్టీ నుంచి గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పటికే బయటకొచ్చి టీడీపీకి దూరంగా, వైకాపాకు దగ్గరగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇక ఎమ్మెల్యేలుగా లేనివారి సంగతైతే చెప్పేపనిలేదు! వారంతా నేరుగా వైకాపా కండువాలు కప్పేసుకుంటున్నారు! ఈ క్రమంలో విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత గద్దె బాబూరావు టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. అది పెద్ద విషయం కాకపోయినా… పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని అంటున్నారు విశ్లేషకులు!
ఒకసారి ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, మరోసారి ప్రభుత్వ విప్ గా పనిచేసి.. విజయనగరంలో ఎదురులేని నేతగా ఉన్న గద్దె బాబూరావు.. ఆత్మగౌరవం లేని చోట ఉండలేనని ప్రకటిస్తూ సైకిల్ దిగిపోయారు! సరే అది ఇప్పుడు టీడీపీ ఉన్న పరిస్థితుల్లోనూ, గద్దె బాబూరావు ఉన్న పరిస్థితుల్లోనూ పెద్ద హాట్ టాపిక్ ఏమీ కాదు! కానీ… ఈ సందర్భంగా మరోసారి బాబు క్రెడిబిలిటీపై బాబూరావు చేసిన కామెంట్లే హాట్ టాపిక్ గా ఉన్నాయి!
గతంలో జిల్లాలో తన చేతుల మీదుగా బీ-ఫారం లు ఇచ్చే స్థాయి నాయకుడిన అయిన నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు అనేది బాబురావు మొదటి మాట కాగా… నాటి టీడీపీకి నేటి టీడీపీకి అసలు పొంతనే లేదన్నది మరో మాట! ఈ మాటలు కార్యకర్తల్లో పునరాలోచనలకు తావిచ్చే అవకాశాలు లేకపోలేదనేది విశ్లేషకుల మాటగా ఉంది!
ఈ విషయంలో పార్టీని వీడి వెళ్తున్నది ఒక్కరా ఇద్దరా అన్నది కాదు పాయింటు… ఇప్పుడు పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఏ ఒక్కరూ పార్టీని వీడకుండా నిలుపుకోవాల్సిన బాధ్యత బాబుపై ఉంది! నాయకులు పోయినా కార్యకర్తలు ఉన్నారు అని పాతచింతకాయపచ్చడి కబుర్లు చెప్పి ఆత్మవంచన చేసుకోవడానికి బాబు & కో సిద్దపడితే చేయగలిగిందేమీ లేదు కానీ… అలాకానిపక్షంలో బాబు భాగ్యనగరం వదిలి కాస్త ఏపీకి వెళ్లి చక్కబెట్టుకోకపోతే మాత్రం… “ఇక సెలవే”!!
-CH Raja