మంత్రి ఉషశ్రీ చరణ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లకు డబ్బులు పంపిణీ పై మంత్రి శ్రీ చరణ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఉషశ్రీ చరణ్ వీడియో బయటకి వచ్చింది. ఆ వీడియోలో ఒక్కో ఓటుకు వెయ్యి రూపాయలు పంపిణీ పై ఆమె కార్యకర్తలతో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పరిధిలో పంచాయతీల వారీగా ఓటర్ల లిస్టు పరిశీలన చేస్తూ.. చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. అయితే వైరల్ అవుతున్న ఈ వీడియో పై స్పందించారు మంత్రి ఉషశ్రీ చరణ్. ఓటర్లను ప్రలోభ పెట్టారన్న అంశంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో ఎటువంటి వాస్తవం లేదని.. ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని ఆరోపించారు.
నేను నా టేబుల్ మీద వేరే అంశం గురించి డిస్కస్ చేస్తున్నానని.. కానీ ఆ వీడియోను మార్ఫింగ్ చేసి వైరల్ చేశారని అన్నారు. ఒక బీసీ మహిళ మంత్రి అయినందువల్ల జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి ఉషాశ్రీ చరణ్. తాను భూములు కొన్న వివాదం చేస్తున్నారని.. ప్రజలకు వాస్తవాలు తెలుసని అన్నారు.