కొద్దిగా శ్రమిస్తూ మెళకువలతో పనిచేయాలి గానీ స్వయం ఉపాధితోనే రూ.కోట్లను సంపాదించవచ్చు. అవును.. సరిగ్గా ఈ విషయమాన్ని నమ్మారు కాబట్టే ఆ ఇద్దరు స్నేహితులు కార్పొరేట్ జాబ్స్‌ను వదిలిపెట్టారు. టవల్స్ బిజినెస్ ( Towles Business ) మొదలు పెట్టారు. అది దినదిన ప్రవర్ధమానం అన్నట్లు వృద్ధిలోకి వచ్చింది. దీంతో కేవలం 3 ఏళ్లలోనే వారు ఆ వ్యాపారంలో అద్భుతమైన ప్రగతిని సాధించారు. రూ.కోట్లలో ఆదాయం పొందుతున్నారు.
అహ్మదాబాద్‌కు చెందిన ఆయుష్ అగర్వాల్, నిహార్ గోసాలియాలు స్నేహితులు. ఇంజినీరింగ్ చదివారు. కొంతకాలం పాటు కార్పొరేట్ కంపెనీలో పనిచేశారు. అయితే సొంతంగా బిజినెస్ చేస్తేనే బాగుంటుందని చెప్పి వారు తమ జాబ్‌లకు స్వస్తి పలికారు. 2018లో ముష్ అప్పారెల్ పేరిట వస్త్రాల వ్యాపారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వారు ఆరంభంలో రూ.5 లక్షల పెట్టుబడి పెట్టారు. వెదురుతో తయారు చేసిన టవల్స్ ను విక్రయించడం మొదలు పెట్టారు. వాటికి ప్రజల నుంచి ఆదరణ లభించింది. దీంతో తక్కువ కాలంలోనే వారి వ్యాపారం వృద్ధి చెందింది.
వెదురు సహజంగానే యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల వాటితో టవల్స్ ను తయారు చేస్తే మన శరీరానికి రక్షణ లభిస్తుంది. అంతేకాదు, పర్యావరణానికీ ఎలాంటి హాని కలగదు. వారు తయారు చేసే టవల్స్ లో 70 శాతం వెదురు ఉంటుంది. 30 శాతం కాటన్ ఉంటుంది. బయట మార్కెట్‌లో సాధారణ కాటన్ టవల్స్ ధర రూ.500 వరకు ఉంటుంది. అయితే వెదురుతో వీరు ప్రత్యేకంగా టవల్స్ ను తయారు చేస్తారు కనుక వాటి ధర ఎక్కువే. రూ.1300, రూ.1499, రూ.1899 లకు మూడు ప్రత్యేకమైన విభాగాల్లో ఆ టవల్స్ లభిస్తున్నాయి.
ఇక వీరు తమ టవల్స్ ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లలోనూ విక్రయిస్తున్నారు. దీంతో వాటికి రాను రాను ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు గత 12 నెలల కాలంలో ఏకంగా రూ.7 కోట్ల అమ్మకాలు కొనసాగించారు. అందులో వారికి రూ.4 కోట్ల ఆదాయం లభించింది. ఇక త్వరలోనే మరింతగా తమ పరిశ్రమను విస్తరిస్తామని వారు చెబుతున్నారు.