ట్రాన్స్‌ఫార్మర్‌లో రాగి వైర్లు తీసుకెళ్లడం.. వ్యవసాయ మోటార్లు దొంగలించడం, రైల్ ఇంజిన్‌లు చోరీ చేయడం లాంటి ఘటనలు చూసి ఉంటాం.. కానీ ఎక్కడైనా సెల్ టవర్‌ను ఎత్తుకెళ్లడం మీరు విన్నారా..? ఆ దొంగలు మామూలు వాళ్లు కాదు.. అంత పెద్ద సెల్ టవర్‌ను ఒక్క ముక్క కూడా మిగల్చకుండా లేపేశారు..ఈ ఘటన బెంగళూరులోనే జరిగింది.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పోలీసులు, కంపెనీ నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. మహదేవుపురాలోని గోశాల రోడ్డులో 50 అడుగుల పొడవు, 10 టన్నుల బరువు ఉన్న టవర్‌ను దొంగిలించారు. అయితే దీనిని రాత్రికి రాత్రే కాకుండా.. ఒక పథకం ప్రకారం.. నెల రోజుల పాటు శ్రమించి తీసుకెళ్లారు.. నెల రోజులు విప్పి ఒక్కొక్క సామానును ఎత్తుకెళ్లారు. వాటిలో జనరేటర్, బ్యాటరీ బ్యాంక్ కూడా ఉన్నాయి. దొంగిలించిన సెల్ టవర్ విలువ రూ.17 లక్షలు ఉంటుందని కంపెనీ నిర్వహకులు తెలిపారు…
సెల్ టవర్‌ను 2009లో ఏర్పాటు చేశారు. దీనిని పర్యవేక్షించే టెక్నీషియన్ గతేడాది ఆగస్టులో రాజీనామా చేశాడు.. ఈ నేపథ్యంలో కొత్త టెక్నీషియన్ సెప్టెంబర్‌లో వచ్చాడు. అయితే, ఈ నెల రోజుల వ్యవధిలో దొంగలు సెల్ టవర్‌ను విప్పుకుని విడి భాగాలను ఎత్తుకెళ్లి పోయారు. కొత్త టెక్నీషియన్ వచ్చి చూసేసరికి సెల్ టవర్ లేదు. సెల్ టవర్ స్థానంలో ఖాళీ స్థలం ఉంది.. టెక్నీషియన్ సమాచారం ఇవ్వడంతో.. కంపెనీ అధికారులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెల్ టవర్‌ను చోరీ చేసిన దొంగల కోసం గాలిస్తున్నారు..
ఈ మధ్యనే.. బీహార్ రాష్ట్రంలోని పుర్ణియా కోర్ట్ రైల్వేస్టేషన్‌లో మొదటిసారి ఓ రైల్ ఇంజిన్‌ను పాతసామాన్లు కొనే మాఫియాకు అమ్మారు. రైలు ఇంజిన్‌ను దొంగిలించింది… అమ్మింది… బయటి దొంగలు కాదు.. ఇంటి దొంగే.. రైల్వేశాఖలోని ఇంటి దొంగలే ఈ పనికి పాల్పడ్డారు. ఓ రైల్వే ఇంజినీర్ ఏకంగా రైలు ఇంజిన్‌ను అమ్మేశాడు. గ్యాస్ కట్టర్‌తో రైలు ఇంజిన్‌ను ముక్కలు ముక్కలుగా చేశాడు. అక్కడున్న కొంతమంది అధికారులు దాన్ని అడ్డుకోగా నకిలీ ధువపత్రాలను చూపించాడు. ఇంజిన్ పాతదైపోయిందని.. విడిభాగాలుగా చేసి డీజిల్ షెడ్‌కు తరలించాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించారని కల్లబొల్లికబుర్లు చెప్పాడు.