కరోనా మహమ్మారి ముందుగా చైనాలోనే పుట్టిందని.. ఆ తరువాత అక్కడి నుంచి ఆ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందిందని.. ఎంతో కాలంగా ప్రపంచ దేశాలన్నీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కరోనా కేసుల సంఖ్య సడెన్‌గా ఆగిపోవడం.. అసలు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియకపోవడం.. కరోనా కేసులు, మృతుల సంఖ్య వివరాలను గోప్యంగా ఉంచడంతో.. అసలు చైనా ప్రపంచానికి ఏదో తెలియని ఓ విషయాన్ని దాస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. అందులో భాగంగానే అమెరికా, యూకేలకు చెందిన పలు మీడియా సంస్థలు చైనా బాగోతాలను ఒక్కొక్కటిగా రుజువులతో సహా బయటకు తీస్తున్నాయి. అయితే చైనాలో కరోనా వైరస్ గురించి బయటి ప్రపంచానికి నిజాలు చెప్పేందుకు యత్నించిన అక్కడి ముగ్గురు ఫ్రీలాన్స్ జర్నలిస్టులు ఇప్పుడు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. గత 2 నెలలుగా వారు అక్కడ మిస్సింగ్ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో చైనాయే వారిని కావాలని దాచి పెట్టిందని వార్తలు వస్తున్నాయి.
చైనాలోని చెన్ కుషీ, ఫాంగ్ బింగ్, లి జెహువా అనే ముగ్గురు ఇండిపెండెంట్ జర్నలిస్టులు గత 2 నెలలుగా కనిపించకుండా పోయారు. ఈ క్రమంలో వారి ఆచూకీ తెలపాలంటూ.. వారికి చెందిన బంధువులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయాన్ని అమెరికా, యూకేలకు చెందిన పలు మీడియా సంస్థలు ధ్రువీకరించి చెబుతున్నాయి కూడా. చెన్ కుషీ వూహాన్ సిటీలో లాక్‌డౌన్ విధించడానికి ముందు… ఫిబ్రవరి 6వ తేదీన అక్కడి కాలమానం ప్రకారం.. రాత్రి 7 గంటల నుంచి కనిపించకుండా పోయాడు. అతని వయస్సు 34 ఏళ్లు. అతను కరోనా వైరస్ గురించి ఆన్‌లైన్‌లో పలు విషయాలను పోస్ట్ చేయాలనుకున్నాడు. కానీ అంతలోపే మిస్ అయ్యాడు. ఓ మహిళ కరోనా వైరస్ వల్ల చైనాలో గుట్టలుగా పేరుకుపోతున్న శవాలపై తన బంధువులకు ఫోన్‌లో చెబుతూ.. తీవ్రమైన భయాందోళనలకు గురైంది. అదే విషయాన్ని చెన్ తన రిపోర్టులో వెల్లడించాలని తెలుస్తోంది. అలాంటి ఎన్నో భయాందోళనలను రేకెత్తించే విషయాలను చెన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ అంతలోపే అతను మిస్సింగ్ అయ్యాడు.
ఇక మరో జర్నలిస్టు ఫాంగ్ వూహాన్ సిటీ వాసి. ఇతను ఫిబ్రవరి 9వ తేదీన మిస్సింగ్ అయ్యాడు. ఓ బస్సులో కుప్పలుగా పడి ఉన్న డెడ్‌బాడీలను ఇతను చిత్రీకరించి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ తరువాత అతని ఇంటికి హజ్మట్ సూట్లు ధరించిన పలువురు అధికారులు వచ్చి అతన్ని తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఫాంగ్ కనిపించకుండా పోయాడు. అలాగే మరో జర్నలిస్టు లి జెహువా (25) ఫిబ్రవరి 26వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. ఇతను యువ జర్నలిస్టే అయినా.. ఉన్నత స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతను వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతోపాటు వూహాన్‌లోని పలు ప్రాంతాల్లో దారుణంగా మారిన పరిస్థితులపై రిపోర్టు సిద్ధం చేసినట్లు తెలిసింది. కానీ ఆ వివరాలను బయటకు రాకముందే జెహువా అదృశ్యమయ్యాడు.
కాగా ఈ ముగ్గురు జర్నలిస్టులు అదృశ్యం కావడం వెనుక చైనా ప్రభుత్వం ఉందని అమెరికాకు చెందిన పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. అమెరికా, యూకేలకు చెందిన పలు మీడియా సంస్థలు కూడా మిస్సైన ఆ జర్నలిస్టులు ఏమయ్యారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. వారు అక్కడి నిజాలను బయటి ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నారని, కానీ అంతలోపే వారు అదృశ్యమయ్యారని.. ఆయా సంస్థలు కథనాలను ప్రచురిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చైనా ఎలా స్పందిస్తుందో చూడాలి..!