ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్ పంచాయతీ పరిధిలోని ఒడ్డెరగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున పురుగుల మందు తాగి ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. నాలుగో తరగతి చదువుతున్న ఆరెపల్లి అక్షర(9), సాదు అఖిల(9), ఐదో తరగతికి చెందిన సాదు ఐశ్వర్య(10) ఏడుస్తుండగా తోటి విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు రాజేశ్‌కుమార్‌కు తెలియజేశారు. ఎందుకు ఏడుస్తున్నారని ఆయన వారిని ప్రశ్నించగా.. అక్షర బ్యాగులోని బాటిల్‌లో ఉన్న తెల్లని ద్రావణాన్ని ముగ్గురం కలిసి తాగినట్లు చెప్పారు.
ఆ బాటిల్‌ను పురుగుల మందు వాసన రావడంతో వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ములుగు ఏరియా ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లాడు. ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని 24 గంటల వరకు పరిశీలించిన అనంతరం ఇంటికి పంపిస్తామని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాలుగో తరగతికి చెందిన విద్యార్థిని బ్యాగులోకి పురుగుల మందు డబ్బా ఎలా వచ్చిందనేది తెలియాల్సి ఉంది.