తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురు అరెస్టయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ బంధువులైన ముగ్గురిని సిట్ అరెస్టు చేసింది. తాజా అరెస్టులతో కలిసి పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం అరెస్టు అయిన వారి సంఖ్య 99కి పెరిగింది. అరెస్టయిన ముగ్గురు నిందితులు ప్రశ్నపత్రాల లీకేజీకి ప్రవీణ్‌కు సహకరించినట్లు దర్యాప్తులో తేలింది. మరో వైపు ఈ కేసులో ఏ2 రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. ఇప్పటికే రాజశేఖర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ మూడుసార్లు తిరస్కరణకు గురైంది.
గత ఏడాది అక్టోబర్ మాసంలో టీఎస్‌పీఎస్ సీ పేపర్లు లీకైౌన విషయాన్ని సిట్ గుర్తించింది. దీంతో గత ఏడాది అక్టోబర్ మాసం నుండి జరిగిన పరీక్షలను టీఎస్‌పీఎస్ సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షలను టీఎస్‌పీఎస్ సీ వాయిదా వేసింది.
వాయిదా వేసిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ను కూడ టీఎస్‌పీఎస్ సీ విడుదల చేసింది. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు కీలక నిందితులుగా సిట్ తేల్చింది. అయితే వీరిద్దరి నుండి పలువురికి ప్రశ్నాపత్రాలు చేరినట్టుగా సిట్ బృందం గుర్తించింది. అయితే ప్రశ్నాపత్రాలు చేతులు మారడంలో డబ్బులు కూడ పెద్ద ఎత్తున చేతులు మారినట్టుగా దర్యాప్తు సంస్థ గుర్తించింది. మరో వైపు ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై ఈడీకి ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా ఈడీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.