ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి పెద్దపులులు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. పట్టణంలోని వినయ్ గార్డెన్ వద్ద రోడ్డు దాటుతుండగా పులిని ప్రయాణికులు చూశారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది పులి పాదముద్రలు సేకరించారు. ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. పులి జాడను వీలైనంత తొందరగా కనిపెట్టాలని అధికారులు ఆదేశించారు.
కాగా, పులి సంచరిస్తున్న నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతనెల 28న కూడా కాగజ్‌నగర్‌లో పెద్దపులి కనిపించింది. గతకొన్ని రోజులుగా కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో సంచరిస్తున్న పులి.. పశువులపై దాడిచేస్తున్నది. వారం రోజుల వ్యవధిలో ఎనిమిది పశువులను చంపి తినేసింది. డివిజన్‌లో వేంపల్లి, కోసిని, అనుకోడ, అంకుశపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతోంది.