ఆ గుడిలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకు 10సార్లు నైవేద్యం

-

శ్రీకృష్ణుడు అలంకార ప్రియుడే కాదు ఆహార ప్రియుడు కూడా. వెన్న, పాలతో తయారు చేసిన పదార్థాలంటే కన్నయ్యకు మక్కువ ఎక్కువ. అందుకే కిట్టయ్యకు పూజ చేసేటప్పుడు ముందుగా కన్నయ్యను అందంగా ముస్తాబు చేసి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక కృష్ణుడి ఆలయాల్లో అయితే కన్నయ్యను ఎంతో అందంగా అలంకరిస్తారు. పలు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. అయితే మన దేశంలో ఓ ఆలయంలో కన్నయ్య ఆకలితో బాధపడుతూ ఉంటాడట. అందుకే అక్కడ కిట్టయ్యకు రోజులో 10సార్లు నైవేద్యం సమర్పిస్తారట. ఒకవేళ స్వామికి నైవేద్యం పెట్టకపోతే విగ్రహం సన్నబడి పోతుందట. భలే వింతగా ఉంది కదా.. మరి ఈ ఆలయం ఎక్కడుంది.. దీని వెనక స్టోరీ ఎంటో తెలుసుకుందామా.?

ఈ శ్రీ కృష్ణుడి ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువరప్పు ప్రాంతంలో ఉంది. ఆ ఆలయంలో ప్రతిష్టించిన కృష్ణుడి విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోలేదు. 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని సమర్పిస్తారు. ప్లేట్‌లో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందని భక్తులు చెబుతారు. కృష్ణుడు తన మేనమామ కంసుడి సంహారం అనంతరం చాలా ఆకలితో ఉన్నాడని.. అదే విధంగా ఈ ఆలయంలోని భగవంతుని విగ్రహం ఆకలితో బాధపడుతుందని హిందువుల విశ్వాసం. స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యం అయినా.. విగ్రహం సన్నబడటం ప్రారంభమవుతుందని ఆలయ పూజారులు చెబుతున్నారు.

ఈ ఆలయాన్ని రోజుకు రెండు నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. శ్రీకృష్ణుడి విగ్రహం కేవలం 2 నిమిషాలు మాత్రమే నిద్రపోతుందని చెబుతారు. ఆలయ తాళపుచెవితో పాటు గొడ్డలిని కూడా పూజారికి ఇస్తారు. తలుపులు తాళం కీతో తెరవలేకపోతే.. తలుపులు తెరవడానికి గొడ్డలిని ఉపయోగించి పగులగొట్టవచ్చు.. ఈ విషయంలో పూజారికి అనుమతి ఉంది. గత కొన్ని వందల ఏళ్లుగా ఈ పద్ధతి పాటిస్తున్నారు.

ఈ ఆలయ ఆచారాలను దృష్టిలో ఉంచుకుని.. గ్రహణ సమయంలో కూడా దీనిని మూసివేయరు. గ్రహణ సమయంలోనూ ఇక్కడ కన్నయ్యకు నైవేద్యం సమర్పిస్తారు. అందుకే ఇక్కడి ఆలయ తలుపులు తెరిచి ఉంచుతారు. ఈ ఆలయంలోని స్వామివారి ప్రసాదం తీసుకున్న వ్యక్తి జీవితంలో ఆకలితో బాధపడరని భక్తులు నమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Latest news