శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను సాయం కొందరికే అందింది. కేవలం ఉద్దానం పరిసరాల్లో ఉన్న రైతులకు అందించి, పరిశ్రమలకు సాయం చేయడం మరిచిపోయారు అన్న వాదన వినిపిస్తోంది. మొన్నటి వేళ తిత్లీ తుఫాను బాధితులకు సంబంధించి 90 వేల మంది లబ్ధిదారులకు 182 కోట్ల 60 లక్షల ఆరు వేలు జమ చేయడం ఆనందంగా ఉంది..అని ప్రభుత్వ ప్రతినిధులు చెప్పారు. అయితే పరిశ్రమలకు మాత్రం ఏపాటి సాయం చేయాలని అనిపించలేదా అని సంబంధిత వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వాస్తవానికి తిత్లీ తుఫాను కారణంగా చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి.
2018 అక్టోబర్ 11న సంభవించిన ఈ తీవ్ర తుఫాను రైతాంగమే కాదు మత్స్యకారులే కాదు పారిశ్రామిక వర్గాలూ తీవ్ర నష్టాలను చవి చూశాయి. ఆ రోజు పంటలు, ఇళ్లతో పాటు పరిశ్రమల పైకప్పులు ఎగిరిపోవడం, నిల్వ చేసిన సరకు తడిచిపోయి పాడైపోవడం, యంత్రాలలో నీరు చేరిపోయి మోరాయించడం, రక్షణ గోడలు కూలిపోవడం, యంత్రాలు కొన్ని ధ్వంసం కావడం అదేవిధంగా పరిశ్రమల ప్రాంగణాన ఏర్పాటుచేసిన ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోవడం వంటివి జరిగాయి. ఆ రోజు లెక్కల ప్రకారం 232 పరిశ్రమలకు నష్టం వాటిల్లింది. అప్పటి అధికారులు వీటిపై సమాచారం సేకరించి, సర్వే నిర్వహించి నష్టాలను అంచనా వేసి నివేదిక కూడా రూపొందించారు. నివేదిక అందుకున్న కలెక్టర్ పరిహారం విషయమై ప్రభుత్వానికి సంబంధిత ఫైల్ ను పంపారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 124 ప్రకారం నష్టంతో సంబంధం లేకుండా ఓ మోస్తరు పెట్టుబడితో నడిచే పరిశ్రమలకు (మైక్రో లెవల్ ఇండస్ట్రీస్-కు) ఇరవై ఐదు వేల రూపాయలు, ఇరవై ఐదు లక్షలు పై బడి, ఐదు కోట్ల రూపాయల లోపు పనిచేసే పరిశ్రమలకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. ఆవిధంగా 72 పరిశ్రమలు ఎంపికయ్యాయి. ఆవిధంగా చూసుకున్నా అన్నింటికీ పరిహారం అందలేదు. అప్పటి లెక్కల ప్రకారం కేవలం 13 పరిశ్రమలకు 4.25లక్షల రూపాయల మేరకు సాయం అందించారు. కానీ మిగిలిన పరిశ్రమల నిర్వాహకులకు మాత్రం సాయం నేటికీ అందలేదు.వీటిపై ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాలని సంబంధిత పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి