రికార్డ్ స్థాయిలో పెరిగిన టమాటో ధరలు

కిలో టమాటో కొనాలంటే సామాన్యుడి కంట కన్నీరు వస్తోంది. రోజురోజుకు టమాటో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. టమాటో రేటు సెంచరీ దాటి పోతోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో కిలో టమాటా ధర వంద రూపాయలను దాటింది. తాజాగా మదన పల్లి మార్కెట్ లో టమాటో ధర రికార్డ్ ధర పలికింది.

వరసగా వర్షాలు, వరదల కారణంగా టమాటో ధరలు పెరుగుతున్నాయి. మదనపల్లి మార్కెట్ లో కిలో టమాటా ధర రూ.104 కు చేరింది. టమాటాకు కేరాఫ్ గా ఉండే మదనపల్లిలోనే ఈ ధర ఉంటే మిగతా ప్రాంతాల్లో మరో 20 రూపాయలు ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో టమాటో ధర రూ. 120కి చేరింది. ఇటీవల ఏపీలో వర్షాల కారణంగా చిత్తూర్, అనంతపురం జిల్లాల్లో టమాటో పంట భారీగా దెబ్బతింది. పంటలు నీట మునిగిపోవడంతో పాటు, దిగుబడి గణనీయంగా తగ్గడంతో టమాటోకు డిమాండ్ ఏర్పడింది. టమాటో తో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.