నేడు ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ధరణి రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ధరణ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కమిషన్‌ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు అంటూ విమర్శలు చేశారు. ఆదిలాబాద్ లో వందల ఎకరాల భూములు అడ్డగోలుగా కొన్నారని, 2014 తర్వాత కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందన్నారు. భూమికి పేదవాడికి అనుబంధ సంబంధం వుందని, కాంగ్రెస్ కు కూడా భూమితో సంబంధం వుందన్నారు. సీలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి లక్షల ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్‌దని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ సంపదని కేసీఆర్ కొల్లగోడుతున్నాడని, కాళేశ్వరం కమిషన్ పైసలు భూములపై పెట్టుబడి పెట్టి లక్షల కోట్లకు ఎగబాకిండు అంటూ ఆయన ఆరోపించారు. కిరాయి కార్లల్ల తిరిగిన కేసీఆర్ కుటుంబానికి వందల కోట్ల కార్లు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ టీఆర్‌ఎస్ రెండు ఒక్కటేనన్న మహేశ్‌గౌడ్.. అమిత్ షా నడిపిస్తున్న డ్రామా అంటూ విరుచుకుపడ్డారు. ఈడీ నోటీసులు కేసీఆర్ కు ఎందుకు ఇస్తలేడని, వచ్చేది కాంగ్రెస్ సర్కారే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.