టీడీపీ కంచుకోట బీటలు వారుతుందా

-

ఒకప్పుడు కర్నూలు జిల్లాలొ కొన్ని నియోజకవర్గాల పేరు చెబితే తెలుగు దేశం పేరు బలంగా వినిపించేది..కనిపించేది.అలాంటిది ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న పార్టీకి ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో మనుగడే కష్టమయ్యేల పరిస్థితి తయారయింది. పార్టీ కేడర్ కి నేతల అండ సైతం కరువవ్వడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో సైతం ఇప్పుడదే పరిస్థితి దాపురించిందట..పదవుల కోసం ఆరాటపడిన నేతలు అధికారం దూరమవ్వగానే తమ దారి తాము చూసుకోవడంతో నియోజకవర్గ కేడర్ కూడా తలో దిక్కు చూస్తుందట…

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి పెట్టని కోట. బలమైన నాయకులు, క్యాడర్ ఆ పార్టీ సొంతం. ఎన్నికల్లో గెలుపు టీడీపీకి నల్లేరు మీద నడకే. ఇదంతా నంద్యాలలో టీడీపీ నేతలంతా కలసి ఉన్నప్పటి మాట. నేతలంతా పార్టీ కోసం పట్టుదలతో పని చేసినప్పటి మాట. క్రమంగా టీడీపీకి పట్టు సడలింది…నేతల్లో చిత్తశుద్ధి కరువైందా…క్యాడర్ కు నేతల అండ లేకుండా పోయిందా అంటే…పరిణామాలు చూస్తే నిజమేననిపిస్తుంది. నంద్యాలలో టీడీపీ పరిస్థితిపై క్యాడర్ కూడా తీవ్ర గందరగోళంలో ఉందట. ఏదైనా సమస్య వస్తే కాపాడే దిక్కు లేరని టీడీపీ క్యాడర్ కూడా పార్టీ పట్ల అంటి ముట్టనట్టు ఉంటున్నారట…

భూమా నాగిరెడ్డి దంపతులు టీడీపీని వీడిన తరువాత నంద్యాలలో టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. ఆ తర్వాత శిల్ప మోహన్ రెడ్డి, శిల్ప చక్రపాణి రెడ్డి సోదరులు టీడీపీ లో చేరినప్పుడు పరిస్థితి మెరుగుపడినా ఆ తరువాత నుంచి మరింత దిగజారి పోయిందట. ప్రస్తుతం నంద్యాలలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఉండగా ముఖ్య నేతలు మాజీ మంత్రి ఫరూక్, ఏవి సుబ్బారెడ్డి టీడీపీ కార్యకలాపాలు చూస్తున్నారు. నియోజకవర్గ ఇంచార్జి భూమా బ్రహ్మానంధరెడ్డి ఇటీవల కాలంలో పార్టీ పరంగా అంత చురుగ్గా లేరట. పార్టీ అధిష్టానం పిలుపు ఇచ్చినప్పుడు మినహా పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం లేదట.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన నంద్యాల ముస్లిం కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో పార్టీ అధినేత చంద్రబాబు స్పందించిన తరువాత గానీ స్థానిక నాయకులు బయటికి రాలేదని గుర్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీకి భూముల కేటాయింపు పై ఆందోళనలు కొనసాగుతుండగా ప్రతిపక్ష టీడీపీ కంటే రైతు సంఘాలు ఎక్కువగా ఆందోళనలో ముందున్నాయట. మండలి మాజీ చైర్మన్ ఫరూక్ అనారోగ్యంతో కొంతకాలం నంద్యాలకు దూరంగా ఉన్నారు. ఇక ఏవీ సుబ్బారెడ్డి తనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి పూర్వ వైభవం తెస్తానని అంటున్నారట. ఇంచార్జి బాధ్యతలు లేకుండా పార్టీ కార్యకలాపాలు తాను చేపడితే సమస్యలు వస్తాయని అంటున్నారట ఏవీ సుబ్బారెడ్డి.

నంద్యాలలో టీడీపీ పరిస్థితిపై క్యాడర్ కూడా ఆందోళనలో ఉందట. పరిస్థితి ఇలాగా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ ఘోరంగా దెబ్బ తింటుందని, జనరల్ ఎలక్షన్స్ నాటికి కార్యకర్తలు ఎవరూ మిగలరని ఆందోళన చెందుతున్నారట. పార్టీ అధిష్టానం నంద్యాలపై దృష్టి సారించాలని అంటున్నారట క్యాడర్. టీడీపీ అధినేత ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news