టీఆర్‌ఎస్‌, బీజేపీల నుంచి పెద్దాయనకి వస్తున్న ఆఫర్లు ఇవే

-

దుబ్బాక అయిపోయింది. జీహెచ్ఎంసీకి పోరు పూర్తయింది. తెలంగాణలో మళ్లీ ఉపఎన్నికపై చర్చ మొదలైంది. నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణమే ఈ చర్చకు కారణం. నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే. అధికార పార్టీ ఇంకా ఉప ఎన్నిక దిశగా ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. కానీ.. ఇతర పార్టీలు మాత్రం లెక్కలు.. సమీకరణాలపై మెల్ల మెల్లగా ఫోకస్‌ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ నాయకుడు జానారెడ్డి పేరు చర్చల్లోకి వస్తోంది.

అందరికి ఆయన పెద్దాయన. రాజకీయం ఇన్నాళ్లు ఆయన్ని వదిలేసింది. కానీ.. పెద్దాయన పేరు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆయనదో లెక్క అయితే.. తనయుడిది మరో లెక్క. కీలక సమయంలో ఇప్పుడా ఇంట్లో రాజకీయం ఎలా ఉంటుందా అన్న చర్చ మొదలైంది. మాజీ మంత్రి జానారెడ్డి సొంత నియోజకవర్గం నాగార్జున సాగర్‌. నోముల అకాల మరణంతో జరగబోయే ఉపఎన్నికలో ఆయన పోటీలో ఉంటారా? లేదంటే కుమారుడిని బరిలో నిలుపుతారా? తనయుడు బరిలో ఉంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? అన్న చర్చ మొదలైంది. జానారెడ్డి ఇప్పటి వరకు నోరు మెదపలేదు కానీ.. ఆయన కుమారుడి రఘువీర్‌పై మాత్రం ఓ రేంజ్‌లో చర్చ జరుగుతోంది.

రఘువీర్‌తో బీజేపీ నాయకులు టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ రఘవీర్‌ కాషాయ కండువా కప్పుకొంటే .. బీజేపీ నుంచి ఆయన్నే బరిలో నిలుపుతారని ప్రచారం ఊపందుకుంది. అయితే ఇదే సమయంలో మరో చర్చ కూడా మొదలైంది. అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ సైతం జానారెడ్డి కుటుంబం మీద కన్నేసినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. రఘువీర్‌తో టీఆర్‌ఎస్‌ కీలక నేత ఒకరు మాటలు కలిపారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు షికారు చేస్తున్నాయి.

అటు బీజేపీ.. ఇటు టీఆర్ఎస్‌ ఒక్కసారిగా జానారెడ్డి కుటుంబంపై కన్నేయడంతో రాజకీయంగా ఏం జరగబోతుందా అన్న ఆసక్తి పెరుగుతోంది. రఘువీర్‌ తీసుకునే నిర్ణయం.. జానారెడ్డి ఒప్పుకుంటారా లేదా అన్న దానిపై ఎవరు విశ్లేషణలు వారు చేస్తున్నారు. కాంగ్రెస్‌ మాత్రం మరోలా ఆలోచిస్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వచ్చే ఉప ఎన్నికలో జానారెడ్డిని బరిలో నిలిపి…ఇప్పటి వరకు ఉన్న ఫెయిల్యూర్‌ అంశాన్ని చెరిపేసుకోవాలనే ఆలోచన చేస్తోందట. పైగా ఇలాంటి సమయంలో జానారెడ్డి పోటీ చేస్తే కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని అభిప్రాయం వ్యక్తమవుతోందట.

Read more RELATED
Recommended to you

Latest news