తెలంగాణ రాష్ట్ర సమితి.. పేరులోనే తెలంగాణకు పరిమితం అన్న అర్థం వచ్చేలా ఉన్న ఈ పార్టీ ఇప్పుడు విస్తరించాలనుకుంటోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లోనూ పోటీ చేస్తామంటూ ఉత్సాహపడినా.. ఎందుకో ఆ పని చేయలేదు. అలా చేస్తే అది చంద్రబాబుకు లాభిస్తుందని.. జగన్ కు నష్టం చేస్తుందని వెనుకడుగు వేసింది. అయితే ఇప్పటికీ ఏపీలోనూ టీఆర్ఎస్ కు ఫ్యాన్స్ ఉన్నారు.
ఇక ఇప్పుడు టీఆర్ఎస్ కన్ను మహారాష్ట్ర ఎన్నికలపై పడింది. తెలంగాణకు మహా రాష్ట్ర, కర్ణాటకలతో సరిహద్దులున్నాయి. ఒకప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు వందల ఏళ్లు హైదరాబాద్ రాష్ట్రంలో ఒకే ఏలుబడి కింద ఉన్నవే.. ఇప్పుడు మరి పాత హైదరాబాద్ స్టేట్ వరకూ టీఆర్ఎస్ విస్తరించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారో ఏమో కానీ.. త్వరలో మహారాష్ట్రలో జరిగే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేసేందుకు రెడీ అవుతుంది.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాలతో పాటు మరో 3 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఇందుకు వారు చెబుతున్నదేమిటంటే… సరిహద్దు గ్రామాల ప్రజలు తెలంగాణలోని సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితులవుతున్నారట. ఈ పథకాలు తమకూ కావాలని కోరుతున్నారట. అది సహజమే.. కానీ ఏ రాష్ట్రం విధానాలు ఆ రాష్ట్రానికి ఉంటాయి కదా.. నాందేడ్ జిల్లా నేతలు కొందరు హైదరాబాద్ వచ్చి సీఎం కేసీఆర్ ను కలిశారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని కోరారట.
అది ఎలా సాధ్యమవుతుంది.. అలా చేయకపోతే.. తమ ప్రాంతాలను ఈ రాష్ట్రంలోనే కలపాలనే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారట. సో.. ఇదంతా మహారాష్ట్ర ఎన్నికల కోసం టీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటున్న పొలిటికల్ గేమ్ అన్నమాట. గతంలో కేసీఆర్ స్నేహితుడిగా పేరున్న అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ప్రయత్నం చేశారు. రాజకీయ పార్టీగా విస్తరించాలనుకోవడం ఏ పారీ తప్పు కాదు.. మరి ఈ వ్యూహంలో కేసీఆర్ ఎంతవరకూ విజయం సాధిస్తారో చూడాలి.