ఎమ్మెల్సీ కవిత పర్యటనతో టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గుమన్నాయా ?

-

ఎమ్మెల్సీ కవిత కొద్దిరోజుల క్రితం ఎంతో ఆడంబరంగా నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లారు. అయితే స్థానికి జిల్లా నేతలతో సంబంధం లేకుండా గ్రేటర్ హైరబాద్ కి చెందిన ఓ ఎమ్మెల్యే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదికగానే గ్రేటర్ ఎమ్మెల్యే,జిల్లా మంత్రి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లాయి. ఇప్పుడి ఈ వివాదం పై టీఆర్ఎస్ నేతల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పర్యటనలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మధ్య రేగిన రగడ అధికార టీఆర్‌ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసుకునే వరకు సమస్య వెళ్లడంతో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి కేడర్‌లో నెలకొంది. ఎమ్మెల్యే మైనంపల్లికి నిజామాబాద్ జిల్లాలో సంబంధం లేకపోవడంతో ఇద్దరి మధ్య కలహానికి దారితీసిన పరిస్థితులను ఆరా తీస్తున్నారు కొందరు నాయకులు.

ఎమ్మెల్సీ కవిత కొద్దిరోజుల క్రితం నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు వెళ్లారు. బోధన్‌ నియోజకవర్గంలోని నవీపేట్‌ మండలం జాన్నేపల్లిలో పురాతన శివాలయం పునః ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మల్కాజ్‌గిరి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు చెందిన ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శివాలయం పునర్నిర్మాణ పనులు జరిగాయి. హైదరాబాద్‌ నుంచి నిజామాబాద్‌ వరకు భారీగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే ఎంతో అట్టహాసంగా.. ఆర్భాటంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎక్కడా మంత్రి ప్రశాంత్‌రెడ్డి కనిపించలేదు. ఇదే జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

వాస్తవానికి నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నే కార్యక్రమాల్లో మంత్రి ప్రశాంత్‌రెడ్డి కూడా ఉంటారు. అలాంటిది శివాలయం ప్రారంభోత్సవంలో లేకపోవడమే చర్చకు దారితీసింది. అయితే ప్రశాంత్‌రెడ్డిని శివాలయ ప్రారంభోత్సవానికి మైనంపల్లి ఆహ్వానించలేదని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రస్తుతం గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి బిజీగా ఉన్నారు. బోధన్‌లో జరిగిన కార్యక్రమానికి తనను పిలవకపోవడంతో ఆయన కినుక వహించినట్టు సమాచారం.

ఈ విషయాన్ని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారట మంత్రి. ఎమ్మెల్యే వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి రావొచ్చని గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు.. ఇద్దరు నేతల మధ్య ఈ అంశం సెగలు రేపుతున్నట్టు సమాచారం. దీంతో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అన్న చర్చ టీఆర్ఎస్ శ్రేణుల్లో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news