గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు.. సార్వత్రిక సమరాన్ని మించిపోయాయి. నాయకులు.. పార్టీలూ.. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం.. భారీ ఎత్తున ప్రచారం చేయడం వంటివి గమనిస్తే.. అసెంబ్లీ ఎన్నికలో.. పార్లమెంటు ఎన్నికలో జరుగుతున్నాయా? అనే భావన కనిపిస్తోందని అంటున్నా రు పరిశీలకులు. మరీముఖ్యంగా అధికార టీఆర్ ఎస్, ప్రతిపక్షం (అలా అని కూడా అనలేం) బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ ప్రచారం చేస్తు న్నాయి. ఎట్టిపరిస్థితిలోనూ గెలుపు గుర్రం ఎక్కాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే.. కేసీఆర్ విషయానికి వస్తే..పట్టు తప్పరాదనే లక్ష్యంతో ఆయన ఉన్నారు.
ఈ క్రమంలోనే గ్రేటర్‌ను గెలిపించే బాధ్యతను ప్రధానంగా ఐదుగురు మంత్రులకు అప్పగించారు. వీరిలో ప్రధానంగా కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డిలకు కీలక బాధ్యతలు ఇచ్చారుసీఎం కేసీఆర్. దీంతో వీరంతా తమకు అప్పగించిన ప్రాంతాల్లోని వార్డుల్లో అభ్యర్థుల కంటే కూడా ముందుగానే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రజలతో కలిసిపోతున్నారు.
వాస్తవానికి అభ్యర్థులకు ఉండాల్సిన తొందర వీరిలోనే ఎక్కువగా కనిపిస్తుండడం గమనార్హం. ఎర్రబెల్లి అయితే.. ఎక్కడ ప్రచారం పూర్తయితే.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారట. ఈ పరిణామం అంతా గమనిస్తే.. ఎన్నికలు కార్పొరేటర్ అభ్యర్థుకా.. మంత్రులకా? అనే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి దీనికి కారణం.. ఏంటి? అంటే.. గ్రేటర్ ఫైట్ అవగానే కేసీఆర్ తన మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయనున్నారనే వార్తలు వస్తున్నాయి. కొత్తవారిని తీసుకునే విషయం ఎలా ఉన్నప్పటికీ.. ఉన్నవారు తమ తమ పీఠాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గ్రేటర్‌ను గొప్ప అవకాశంగా భావిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇటీవల దుబ్బాక ఎఫెక్ట్‌తో ఇప్పటికే మంత్రి హరీష్ రావుపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. అయితే, ఆయన మేనల్లుడే కనుక.. సరిపోయింది. కానీ, తమ పరిస్థితి ఏమవుతుందో.. అని మంత్రులు హడలిపోతున్నారు. మొత్తానికి గ్రేటర్ ఫైట్ ముగిసేవరకు తమకు ఇంతేనని ఆఫ్‌ది రికార్డుగా వారు అసహనం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.