ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉన్న జిల్లా అని చెప్పొచ్చు. ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్‌కు మంచి ఫలితాలే వచ్చాయి. కానీ గత ఎన్నికల్లోనే ఇక్కడ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. జిల్లాలో ఉన్న 12 సీట్లలో కాంగ్రెస్ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంది. మునుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్‌ల్లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగిరింది. అయితే నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టిఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు.
అటు హుజూర్‌నగర్‌లో గెలిచిన ఉత్తమ్ కుమార్, నల్గొండ ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టిఆర్‌ఎస్ విజయం సాధించింది. అంటే నల్గొండలో కాంగ్రెస్‌కు ఒక్క సీటే మిగిలింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కరే మిగిలారు. అయితే ఈయన కూడా కాంగ్రెస్‌తో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. రేవంత్ రెడ్డికి పిసిసి పదవి వచ్చాక కోమటిరెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌కు దూరంగా ఉంటున్నారు.
అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు సైతం అంత దూకుడుగా ఉండటం లేదు. ఇక సీనియర్ నేతలు జానారెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డిలు కూడా సైలెంట్ అయ్యారు. అయితే ఇప్పుడుప్పుడే రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. అటు టిఆర్‌ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి పరిస్తితిలో నల్గొండ కాంగ్రెస్ నాయకులు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల, జిల్లాలో కాంగ్రెస్ ఇంకా బలోపేతం కాలేకపోతుంది.
కానీ ఈ జిల్లాలో కాంగ్రెస్‌కు కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ఒక్కసారి యాక్టివ్ అయితే టిఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేయొచ్చు. పైగా జిల్లాలో ఉన్న టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరుకు పెద్దగా మంచి మార్కులు ఏమి పడటం లేదు. ఇలాంటి పరిస్తితుల్లో కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా పనిచేస్తే టిఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేయొచ్చు. కానీ ఇక్కడ నేతలు రేవంత్‌పై గుర్రుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్తితుల్లో నల్గొండ నాయకులు కాంగ్రెస్ కోసం పనిచేసి టిఆర్‌ఎస్‌కు చెక్ పెడతారో లేదో చూడాలి.