ఆ మున్సిపల్ పీఠం టీఆర్ఎస్ చేజారనుందా ?

-

మెదక్‌ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలే దీనికి కారణం. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఒంటెద్దు పోకడలకు పోతున్నారని కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరేశారు. విపక్ష సభ్యుల సహకారంతో ఏకంగా మున్సిపల్‌ ఛైర్మన్‌నే మార్చేందుకు పావులు కదుపుతున్నారట..దీంతో టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఒక్క సారిగా కలకలం రేగింది. తమకు పార్టీ కన్నా ఆత్మగౌరవమే ముఖ్యమని కొందరు కౌన్సిలర్లు తెగేసి చెప్పడంతో స్థానిక ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారట ఈ కోల్డ్‌వార్‌లో ఎవరు పైచెయ్యి సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది.


ఆందోల్ నియోజకవర్గంలోని జోగిపేట మున్సిపాలిటి మొత్తం 20 మంది కౌన్సిలర్లలో టీఆర్‌ఎస్‌కు 13, కాంగ్రెస్‌కు 6, ఒక ఇండిపెండెంట్‌ ఉన్నారు. ఛైర్మన్‌ గూడెం మల్లయ్యతో వచ్చిన గ్యాప్‌ కారణంగా టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారట. తమ అసంతృప్తి జ్వాలలను చల్లార్చుకోవడానికి అక్కడితో ఆగితే సరిపోదని భావించారో ఏమో.. ప్రతిపక్ష సభ్యుల సాయంతో ఏకంగా మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని కైవశం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారట. అదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

గత ఏడాది జనవరిలో ఆందోల్‌ జోగిపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. గూడెం మల్లయ్యను ఛైర్మన్‌గా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. కొత్తలో అంతా సఖ్యంగానే ఉన్నా.. ఎన్నికలైన 3 నెలల నుంచి వివాదాలు మొదలయ్యాయట. అప్పుడొచ్చిన గ్యాప్‌ అంతకంతకూ పెరిగినట్టు సమాచారం. ఇటీవల మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించగా.. 8 మందే హాజరయ్యారట. టీఆర్‌ఎస్‌కు చెందిన ఐదుగురు మహిళా కౌన్సిలర్లు, కాంగ్రెస్‌, ఇండిపెండెంట్‌ సభ్యులు రాలేదట. అయినా సమావేశం కొనసాగించడంపై గుర్రుగా ఉన్నారట అసంతృప్తులు. కోరం లేకపోయినా ఎలా భేటీ కొనసాగిస్తారని ప్రశ్నిస్తున్నారు. మూడింట ఒకవంతు సభ్యులు హాజరయ్యారని కమిషనర్‌ చెప్పడంపై అడిషనల్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారట.

టీఆర్‌ఎస్‌లో ముందు నుంచి ఉన్న వారికి కాకుండా మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు అసంతృప్తులు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ కూడా సరికొత్త ఎత్తుగడలకు పావులు కదుపుతోందట. టీఆర్‌ఎస్‌ అసంతృప్తులను కలుపుకొని చైర్మన్‌ పీఠం ఎక్కేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే మాట్లాడేందుకు ప్రయత్నించినా రెబల్స్‌ అందుబాటులోకి రావడం లేదని తెలుస్తోంది.మొత్తానికి ఆందోల్‌ టీఆర్‌ఎస్‌లో మొదలైన విభేదాలు మున్సిపల్ పీఠాన్ని దూరం చేసేలా ఉన్నాయి. ఎమ్మెల్యే మాట కూడా అసంతృప్తులు వినే పరిస్థితి లేకపోవడంతో అధికార పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news