ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకేర్ జిల్లాలోని కోరేర్ సమీపంలో విద్యార్థులను తీసుకెళ్తున్న ఓ ఆటోను ట్రక్కు
ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మరణించారు. మరో విద్యార్థి, ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను కోరేర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ రోడ్డు ప్రమాదంపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన ట్వీట్ చేశారు.
ఇదిలా ఉంటే.. కాకినాడలోని పెద్దపురం మండలం జి.రాగంపేటలో విషాదం చోటు చేసుకుంది. అంబటి సుబ్బయ్య ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేసేందుకు కార్మికులు ట్యాంకర్‌లోకి దిగారు. ప్రమాదవశాత్తు ట్యాంకర్‌లో ఊపిరాడకపోవడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులుగా, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే నిర్మాణంలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది.
కాగా, ఇలాంటి ఘటనల్లో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఫ్యాక్టరీ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నా.. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. రెక్కాడితే కాని డొక్కాడని కార్మికుల బతుకులు ఛిద్రమైపోతున్నాయి.