అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ కొత్త టారిఫ్‌లపై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పందించారు. కొత్త సుంకాలు అమెరికాకు మేలు చేస్తాయని తాను భావించడం లేదని అన్నారు. ట్రంప్ యంత్రాంగం తీరును కొంతకాలంగా నిశితంగా గమనిస్తున్నానని చెప్పారు.
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఒబామా.. హక్కుల ఉల్లంఘనకు వైట్‌హౌస్ పాల్పడుతోందని.. తాజా పరిణామాలు ఎంతో ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు తెలియజేసే విద్యార్థులను తొలగించాలంటూ యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం బెదిరించడం ఆందోళనకర అంశమని అభిప్రాయపడ్డారు.
ఎన్నికల ముందు డెమోక్రాటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా బరాక్ ఒబామా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ట్రంప్ రెండోసారి ఎన్నికైతే ఎదురయ్యే ముప్పు గురించి ముందే హెచ్చరించిన ఒబామా.. ట్రంప్ తనదైన శైలిలో వ్యవహరిస్తారని ఇబ్బందులు కలిగిస్తారని ఆయన చెప్పారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడి నిర్ణయాల పట్ల మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తీవ్రంగా స్పందిస్తూ.. ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని, అవి స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.