టీఎస్‌ఆర్టీసీ ప్రారంభించిన ‘కార్గో, పార్శిల్’ సర్వీసు పేరు మారింది. ఆ సేవల పేరును ‘టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీసెస్’గా మార్చారు. ఈ మేరకు పేరును మార్చుతూ ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ మార్పు అమలులోకి వస్తుందని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఆర్టీసీలో పార్శిల్ సేవలను గతంలో ప్రైవేటు ఏజెన్సీ నిర్వహించేది. అదనపు ఆదాయమార్గాల అన్వేషణలో భాగంగా టీఎస్‌ఆర్టీసీ సొంతంగా 2020 జూన్ నుంచి కార్గో, పార్సిల్ వ్యవస్థను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆ సేవల పేరును ఇక నుంచి ‘టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్ సర్వీసెస్’గా వ్యవహరిస్తారు.
ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కార్గో సేవలను ఆర్టీసీ విస్తరించింది. ఇప్పటిదాకా బుకింగ్ కౌంటర్‌కు మాత్రమే పార్శిళ్లు రవాణా చేసిన ఆర్టీసీ.. ఇప్పుడు డోర్ డెలివరీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేట్, ఎంజీ రోడ్, ప్యారడైజ్, సికింద్రాబాద్, హబ్సీగూడ, బోయిన్ పల్లి, అంబర్ పేట్, తిరుమలగిరి, తార్నాక, హిమాయత్ నగర్, ఉప్పల్, సహా మరికొన్ని ప్రాంతాల్లో డోర్ డెలివరీ సేవలు చేస్తున్నారు. మరో 30 నుంచి 35 ప్రాంతాలకు సేవలను విస్తరిస్తామని కార్గో కొరియర్ పార్శిల్ ఇన్‌ఛార్జ్ జీవన్ ప్రసాద్ తెలిపారు.