తెలంగాణ ఆర్టీసీ మరో ఉత్తమ నిర్ణయం తీసుకుంది. విద్యార్థినులకు పూర్తి రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఉదయం తీసుకెళ్లడం.. సాయంత్రం తిరిగి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రిప్పులు నడపడానికి సన్నాహాలు చేస్తోంది.
సొంతంగా రవాణా వ్యవస్థ ఉన్న కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి ఏడాదికి రూ.40 వేల నుంచి రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. దీన్ని భరించే ఆర్థిక స్థితి లేని వారిని గుర్తించి 50 మందికో బస్సు ఉండేలా సిద్ధం చేయాలని నిర్ణయించింది. స్థిరమైన ఆదాయం సమకూరడమే కాకుండా.. సురక్షితమైన ప్రయాణం అందించడానికి వీలుపడనుందని ఆర్టీసీ భావిస్తోంది.
కళాశాల దూరాన్ని బట్టి బస్సు టిక్కెట్ ధర ఆధారంగా నెలవారీ ప్రత్యేక పాస్‌ను సమకూర్చాలని నిర్ణయించింది. విద్యార్థుల బస్సు పాస్‌తో సంబంధం లేకుండా.. ప్రత్యేకంగా ఆ బస్సులో విద్యార్థినులే ప్రయాణించేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం ప్రతి విద్యార్థి ఏడాదికి దాదాపు రూ.20 వేలకు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు.