నేడు పాలక మండలి సమావేశంలో రూ.3,300 కోట్ల టీటీడీ బడ్జెట్‌

-

వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి నేడు సమావేశం కానుంది. ఈ భేటీలో రూ.3,300 కోట్లతో 2023-24 ఏడాదికి టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆనంద నిలయం స్వర్ణమయం, ఇంజినీరింగ్ పనులతో పాటు 398 అంశాలపై పాలక మండలి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవలోక్లో యాత్రికుల వసతి సముదాయాల నిర్మాణానికి రూ.112 కోట్లు, ఉల్లందూర్, యానాంలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి నిధుల కేటాయింపుపై చర్చిస్తారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ధార్మిక సేవల విస్తరణ, వివిధ ప్రాంతాల్లో దేవస్థానం తలపెట్టిన ఆలయ నిర్మాణపనులకు నిధుల కేటాయింపులపై చర్చిస్తారు. తిరుమలలో దేవస్థాన ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై సుధీర్ఘంగా చర్చించి సముచిత నిర్ణయం తీసుకోనున్నారు. తిరుపతి సమీపంలోని అలిపిరి – చెర్లోపల్లి మార్గంలో తలపెట్టిన స్పిరిచ్యువల్ సిటీలో దాదాపు 50 వేల మంది భక్తులకు ఒకే చోట వసతి కల్పించేవిధంగా వసతిగృహ సముదాయం నిర్మించే విషయమై పాలకమండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే తమిళనాడులోని ఉలందూరు పేటలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించి 4 కోట్లు, యానాంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి 3 కోట్లు నిధులను మంజూరు చేయనున్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదాల పంపిణీకోసం మరిన్ని కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 8 కాటేజీల పునర్నిర్మాణం కోసం ఈ టెండర్ విధానంపై చర్చించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news