జనగామ జిల్లా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇవాళ రేవంత్ యాత్రను చేపట్టారు. దేవరుప్పుల, కొత్త కాలనీ, దేవరుప్పుల తండా, ధర్మాపురం, మైలారం, విస్నూరు, కాపులగడ్డ తండా తదితర గ్రామాల్లో పాదయాత్ర చేసి, పాలకుర్తిలో జరిగే సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని విభజించి, పాలించడమే బీజేపీ విధానమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భద్రాచలం గుర్తింపు కోల్పోయిందని రేవంత్ విమర్శించారు. రూ.100కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తానని విస్మరించారన్నారు.
వరద బాధితులకు ఇస్తామన్న రూ.10 వేలు కూడా ఇవ్వలేదన్నారు. సీతారామ ప్రాజెక్టు భూనిర్వాసితులకు పరిహారం అందలేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీ లేదు… గెలిచేది లేదని ఎద్దేవా చేశారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు. కౌలు రైతులకు రూ.15 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ చెప్పారు. రేవంత్ రెడ్డి వరంగల్ పార్లమెంట్ పరిధిలో రేపటి నుంచి చేపట్టనున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశారు.