శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. నేడు సెప్టెంబర్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆన్‌లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంటాయి. అయితే.. కరోనా వ్యాప్తి అనంతరం దాదాపు రెండేళ్ల తరువాత ఆన్‌లైన్ , ఆఫ్ లైన్ విధానంలో భక్తులకు శ్రీవారి దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తెచ్చింది. గత నెల రోజుల నుంచి తిరుమలలో స్వామి వారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి హుండీకి సైతం కానుకలు భారీగా వస్తున్నాయి. మొన్న ఒక్కరోజులో శ్రీవారిని 73,439 మంది భక్తులు దర్శించుకున్నారు.
34,490 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకోగా, ప్రస్తుతం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందకు దాదాపు 9 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనానికి 30 కంపార్టమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 2018 జూలై 26న రికార్డు స్థాయిలో రూ.6.28 కోట్ల కానుకలు శ్రీవారి హుండీకి వచ్చాయి. ఆ తరువాత దాదాపు మూడేళ్లకు దాదాపుగా అదే స్థాయిలో హుండీకి కానుకలు చేరాయి. సోమవారంనాడు రికార్డు స్థాయిలో రూ. 6.18 కోట్ల కానుకలు వచ్చాయి. టీటీడీ చరిత్రలో రెండోసారి 6 కోట్ల రూపాయలు పైగా కానుకలు హుండీలో సమకూరినట్లు వెల్లడించారు అధికారులు.