ప్రీతి కేసులో తెరపైకి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మెడికో ప్రీతి ఆత్మహత్యకు రూ.50 లక్షల అడ్మిషన్ బాండ్ కూడా ఓ కారణంగా తెలుస్తోంది. అడ్మిషన్ తీసుకున్నాక మధ్యలో మానేస్తే యూనివర్సిటీకి రూ.50 లక్షలు చెల్లించాలి. ఇదే ప్రీతి పాలిట శాపం అయిందనే చర్చ జరుగుతోంది.
సైఫ్ వేధింపులు ఎక్కువ కావడంతో చదువు మానేసి రావచ్చు కదా అని తండ్రి అంటే, రూ.50 లక్షలు యూనివర్సిటీకి చెల్లించాలి కదా? ఎలా కడతావు? వద్దులే అని ప్రీతి చివరి మాటల్లో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, జనగాం జిల్లా కోడకండ్ల మండలం గిర్నితండా గ్రామంలో సోమవారం మధ్యాహ్నం మెడికో ప్రీతి అంత్యక్రియలు ముగిసాయి. డాక్టర్ ప్రీతిని చివరిసారిగా చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చారు. కుటుంబ సభ్యుల అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిసాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు.