అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని, ఆరు నెలల్లోనే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని..రైతులకు న్యాయం చేయాలని చెప్పి..అమరావతి అంశంపై హైకోర్టు గతంలో ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వం సైతం మూడు రాజధానుల బిల్లుని రద్దు చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది..ఇక ప్రభుత్వం వైపునా, రైతుల వైపున వాదనలు విన్న ధర్మాసనం..ఊహించని విధంగా స్పందించింది.
అటు ప్రభుత్వానికి, ఇటు అమరావతి రైతులకు షాక్ ఇచ్చేలా సుప్రీం వ్యాఖ్యలు ఉన్నాయి. మొదట ప్రభుత్వం కోరినట్లు..పూర్తిగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే ఇవ్వలేదు. కానీ అంశాలపై మాత్రం స్టే విధించింది. రాజధానిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితికి సంబంధించి మాత్రమే సుప్రీం స్టే విధించింది. రాజధానిపై అసెంబ్లీకి చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించడానికి సుప్రీం నిరాకరించింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను జనవరి 31వ తేదీకి వాయిదా వేసింది. అంటే పరిమిత గడువు లోపు రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు తీర్పు ఇస్తే…ఈ తీరుపై సుప్రీం స్టే విధించి..రైతులకు షాక్ ఇచ్చింది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు పూర్తి స్థాయిలో స్టే ఇవ్వకుండా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఇలా రెండువైపులా షాక్ తగిలింది.
ఇదిలా ఉంటే మూడు రాజధానులకు ప్రజల మద్ధతు ఉందని, మూడు రాజధానుల బిల్లుని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని, త్వరలో విశాఖ నుంచి జగన్ పరిపాలన కొనసాగుతుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. అయితే మూడు రాజధానుల బిల్లు వస్తే మళ్ళీ రైతులు కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మరి రాజధానిపై రచ్చ ఎప్పుడు తగ్గుతుందో అర్ధం కాకుండా ఉంది..ఈ రచ్చ వల్ల రాష్ట్రానికంటూ ఒక రాజధాని చెప్పుకోవడానికి లేదు.