హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలిచిన దగ్గర నుంచి ఈటల రాజేందర్ దూకుడు పెరిగిన విషయం తెలిసిందే. కేసీఆర్‌కు ఎక్కడకక్కడే చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈటల ముందుకెళుతున్నారు. తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నిర్ణయాలని సైతం పక్కనబెట్టి…టీఆర్ఎస్కు చెక్ పెట్టడానికి గట్టిగా ట్రై చేస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ..టీఆర్ఎస్పై ఏ విధం పోరాడుతుందో అందరికీ తెలిసిందే.
అయితే తాజాగా స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది. ఎందుకంటే స్థానికంగా బీజేపీకి ఎక్కువ సపోర్ట్ లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ఈటల మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. బలం లేకపోయినా పోటీ చేస్తేనే టీఆర్ఎస్కు భయం ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఇక ఆయనే స్వయంగా…రెండు చోట్ల అభ్యర్ధులని నిలబెట్టడంతో సరికొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ విషయం ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు.
సీఎం కేసీఆర్ ఆరిపోయే దీపం అని, ఆయన పని అయిపోయినట్లేనని, కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతోందని తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో ఒక స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో తానే ఒకరిని పోటీకి పెట్టానని, ఎన్నికల్లో గెలుస్తామా, ఓడతామా అన్నది పక్కనబెట్టి పోటీ చేయడం ముఖ్యమని, టీఆర్ఎస్కు ఏకగ్రీవం అవకాశం ఇవ్వవద్దని, పోటీచేస్తే కేసీఆర్‌కు భయమైనా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
అయితే కరీంనగర్ ఎన్నికల్లో మాజీ మేయర్ రవీందర్ సింగ్ టీఆర్ఎస్కు రాజీనామా చేసి మరీ…ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. ఈయనకు ఈటల మద్ధతు ఉందని తెలుస్తోంది. అటు ఆదిలాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్‌కు పోటీగా స్వతంత్ర అభ్యర్థి పెందూర్ పుష్పరాణి బరిలో నిలిచారు. పుష్పరాణికి ఈటల మద్ధతు ఉందని తేలిపోయింది. కరీంనగర్లో రవీందర్ సింగ్‌కు టీఆర్ఎస్ సభ్యులు కూడా మద్ధతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈటల…కరీంనగర్లో ఒక స్థానంలో టీఆర్ఎస్ ఓడిపోతుందని అంటున్నారు. మొత్తానికైతే ఈటల మామూలు ట్విస్ట్‌లు ఇవ్వడం లేదు.