ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం మొదలు పెట్టి ఇప్పటికి 4 నెలలు దాటింది. అయితే.. నెలలు గడుస్తున్నా రష్యా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. అంతే ధీటుగా ఉక్రెయిన్ సైన్యం సైతం రష్యా బలగాలను తిప్పికొడుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం రోజురోజుకూ మరింత ధ్వంసమవుతూనే ఉంది. ప్రతి రోజు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జీ-7 దేశాధినేతలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక విన్నపం చేశారు. ప్రస్తుతం జర్మనీలో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్ స్కీ ప్రసంగించారు.
పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో తమ బలగాలకు యుద్ధ పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయని ఆయన అన్నారు. యుద్ధ తీవ్రత పెరుగుతోందని చెప్పారు. ఈ ఏడాది చివరికైనా యుద్ధం ముగిసేలా శాయశక్తులా కృషి చేయాలని కోరారు. రష్యాపై ఆంక్షలను తీవ్రతరం చేయడంతో పాటు… వివిధ మార్గాల ద్వారా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు.