క్రిమియాకు విముక్తితోనే యుద్ధం ముగింపు: జెలెన్‌స్కీ

-

రష్యా ఉడుం పట్టు నుంచి క్రిమియాను స్వాధీనం చేసుకొన్నప్పుడే యుద్ధానికి ముగింపు లభిస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం క్రిమియాతోనే మొదలైందని.. దాని విముక్తితోనే అది ముగుస్తుందని చెప్పారు. ఆయన నిన్నరాత్రి క్రిమియా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

‘‘క్రిమియా ఎప్పటికీ ఉక్రెయిన్‌దే.. ఎన్నటికీ వదిలిపెట్టబోం’’ అని  స్పష్టం చేశారు. 2014లో రష్యా దళాలు క్రిమియాను ఆక్రమించుకొన్నాయి. కానీ, అధికారికంగా ఉక్రెయిన్‌లోని భాగంగానే చాలా దేశాలు ఇప్పటికీ గుర్తిస్తున్నాయి.

క్రిమియాలోని రష్యా వాయుసేన స్థావరంపై భారీ ఎత్తున దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే జెలెన్‌స్కీ ప్రసంగించడం గమనార్హం. అయితే.. ఆయన తన ప్రసంగంలో క్రిమియాలో దాడుల అంశాన్ని ప్రస్తావించలేదు. రష్యా వాయుసేన స్థావరంలో మొత్తం 12 పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఒక పౌరుడు మరణించినట్లు సమాచారం.  మాస్కో ఈ దాడుల తీవ్రతను తగ్గించి చూపిస్తోంది. ఉక్రెయిన్‌ సైన్యం కూడా ఇప్పటి వరకు ఈ దాడుల బాధ్యతను స్వీకరించలేదు.

క్రిమియాపై దాడుల్లో ఉక్రెయిన్‌ హస్తం ఉందని తేలితే యుద్ధం మరింత తీవ్రం కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం మొదలైన తర్వాత క్రిమియాపై జరిగిన తొలి అతిపెద్ద దాడి ఇదే. ఈ ఏడాది జూన్‌లో నల్లసముద్రంలోని క్రిమియా జలాల్లో ఉన్న రష్యా చమురు రిగ్‌పై దాడి జరిగింది. జులైలో సెవస్టపోల్‌లోని నౌకాదళ స్థావరంపై డ్రోన్‌ దాడి జరిగింది. ఈ ఘటనలో  పలువురు గాయపడ్డారు. తాజా దాడితో క్రిమియాలోని లక్ష్యాలపై ఉక్రెయిన్‌ ఓ వ్యూహం ప్రకారం దాడులు చేస్తోందనే భయాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రతిస్పందన తీవ్రంగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news