గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌పై భీకర యుద్ధం చేస్తున్న రష్యా వార్‌కు ఒకరోజు బ్రేక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. రష్యాలో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో దేశాధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్‌లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తన సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ‘రష్యా ఆధ్యాత్మిక గురువు పాట్రియార్క్ కిరిల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని.. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 6న మధ్యాహ్నం 12 గంటలనుంచి జనవరి 7న అర్ధరాత్రి 12 వరకు 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా రక్షణ మంత్రిని పుతిన్ ఆదేశించారు’ అని క్రెమ్లిన్ తెలిపింది.
ప్రపంచంలో దాదాపు అన్నిచోట్ల డిసెంబరు 25నే క్రిస్మస్ జరిపితే.. రష్యాలో తేదీ భిన్నంగా ఉంటుంది. రష్యాతోపాటు ఉక్రెయిన్‌లోనూ కొంతమంది జనవరి 7న ఆర్థడాక్స్ క్రిస్మస్ చేసుకుంటారు. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా చర్చల విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తన ప్రతిపాదనను పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌లో తాము స్వాధీనం భూభాగాలను రష్యాలో అంతర్భాగమని అంగీకరిస్తే ఆ దేశంతో చర్చలకు సిద్ధమని తెలిపారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో ఫోన్‌లో సంభాషణ సందర్భంగా పుతిన్ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేసినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది.