ఆన్‌లైన్ మార్కెట్‌లో ఏది కావాలన్నా.. ఆర్డర్ చేస్తే చాలు క్షణాల్లోనే ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. జనాలు బయటకు వెళ్లి కొనుక్కునే రోజులు పోయాయి. ఇంట్లో సరకులు మొదలు తినేవి, తాగేవి ఏం కావాలన్నా అంతా ఆన్‌లైనే.. అయితే ఇలా వచ్చే వాటిల్లో దాదాపు అన్నీ క్వాలిటీగానే ఉంటాయి..కొన్నిసార్లు మాత్రం కాస్త పాడైన కూరగాయలు వస్తుంటాయి.. కానీ ఇప్పుడు జరిగిన ఘటన చూస్తే.. ఇంకోసారి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయాలంటే.. మీకు దడ పడుతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ చేస్తే.. బ్రెడ్‌తో బోనస్‌గా ఎలుకను కూడా పంపారు.. అది కూడా బతికి ఉన్న ఎలుక.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
నిమిషాల్లో గ్రాసరీలు డెలివరీ చేసే బ్లింకిట్‌లో.. కొన్ని రోజుల క్రితం బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ పెట్టాడు నితిన్ అరోరా. ఆర్డర్ త్వరగానే వచ్చింది. హమ్మయ్య అనుకుంటూ.. బ్రెడ్ ప్యాకెట్ బయటకు తీశాడు. అంతే.. మనోడికి బొమ్మలు ఎగిరిపోయాయ్.. అందులో ఎలుక ఉంది.. అది కూడా బతికే ఉంది.
అసలు ఆ ఎలుక బ్రెడ్ ప్యాకెట్లోకి ఎలా దూరింది. అయితే.. దానిని ప్యాక్ చేసిన దుకాణదారుడు, తీసుకొచ్చిన డెలివరీ ఏజెంట్ కూడా ఎలుకను గుర్తించకపోవడం ఇక్కడ హైలెట్..
ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న అరోరా..01-02-23న నేను బ్రెడ్ ప్యాకెట్ ఆర్డర్ ఇచ్చాను. అందులో ఎలుక వచ్చింది. షాక్‌కు గురయ్యాము. 10 నిమిషాల్లో డెలివరీ చేస్తామని ఇలాంటివి ఇస్తుంటే.. వీటిని తీసుకోవడం కన్నా నేను గంటలు గంటలు ఎదురుచూసి మంచి ప్రోడక్ట్నే ఎంపిక చేసుకుంటాను,” అని బ్లింకిట్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు.
బ్లింకిట్ స్పందన..
“కస్టమర్లకు ఇలాంటి అనుభవం ఉండాలని మేము అనుకోవడం లేదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌తో పాటు ఆర్డర్ ఐడీని మెసేజ్ చేయండి. మేము పరిశీలిస్తాము,” అని నితిన్ ఆరోరా ట్వీట్‌కు బదులిచ్చింది బ్లింకిట్.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు ఇచ్చిపడేస్తున్నారు. ఒక నెటిజన్ నాకు కూడా ఇలాంటి అనుభవమే గతంలో ఎదురైంది.. అయినా సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదని కమెంట్ చేశారు.