సిక్కోలు టీడీపీ నేతల్లో అనూహ్య మార్పు..కారణం వైసీపీ మంత్రి వర్యులట…!

-

మొన్నటి వరకూ సిక్కోలు టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్నారు. ఇప్పుడు ఐకమత్యమే మహాబలమన్నట్టు కలిసిపోయారు. దీనికంతటికీ కారణం ఇటీవల ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చేసిన ఒకే ఒక్క కామెంట్‌ అట..అమరావతి రైతుల ఆందోళనపై డిప్యూటీ సీఎం టంగ్‌ స్లిప్‌ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. టీడీపీ విరుచుకుపడింది. అదే సమయంలో డిప్యూటీ సీఎంపై సిక్కోలు టీడీపీ నేతలు యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. ధర్మాన కృష్ణదాస్‌ చేసిన ఒకే ఒక్క కామెంట్‌ నిస్తేజంగా పడిఉన్న సైకిల్‌కు బూస్టప్‌ ఇచ్చిందట.


టీడీపీకి కంచుకోటగా భావించే శ్రీకాకుళంలో తమ్ముళ్ల మధ్య గ్రూప్‌ పాలిటిక్స్‌ ఓ రేంజ్‌లో సాగుతుంటాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళా వెంకట్రావు వర్సెస్‌ అచ్చెన్నాయుడు అన్నట్టు పరిస్థితులు ఉండేవి. ఎవరి వర్గాలు వారివే. కొందరు అటూ ఇటూ ఊగుతూ.. ఇద్దరి మధ్య నలుగుతూ మసులుకునేవారు. మొన్నటి ఎన్నికల్లో అధికారం దూరం కావడంతో గ్రూపు రాజకీయాల మాట దేవుడెరుగు.. కనీసం నాయకత్వం వహించేవారే కనిపించలేదు. ఎవరిని కదిపినా మౌనమే సమాధానంగా ఉండేది.

శ్రీకాకుళం పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడిగా కూన రవికుమార్‌కు బాధ్యతలు అప్పగించడం ఇష్టం లేక స్తబ్దుగా ఉన్న నాయకులంతా.. ధర్మాన కామెంట్స్‌తో విభేదాలను పక్కనపెట్టి లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. అచ్చెన్న అరెస్ట్ సమయంలో కూడా సాధ్యం కాని ఐకమత్యాన్ని ప్రదర్శించారు. జిల్లా నేతలను ఒకేతాటిపైకి తీసుకొచ్చారు కూన. కళా వెంకట్రావు మొదలుకొని, ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు ఇలా అంతా కలిసి నరసన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. డిప్యూటీ సీఎం ధర్మాన చేసిన ఒకే ఒక్క మాటతో గడిచిన దశాబ్దకాలంలో లేని ఐకమత్యం టీడీపీలో కనిపిస్తోందట. అందుకే తెలుగు తమ్ముళ్లు లోలోన దాసన్నకు థ్యాంక్స్‌ అని చెప్పుకొంటున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news