తెలంగాణలో బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తునే ఉంది. ఆ మాటల యుద్ధం కాస్తా.. ఇటీవల జాతీయ నాయకులు తెలంగాణకు వస్తున్న నేపథ్యంలో ముదురుతోంది. అయితే తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫార్మ్ హౌస్ ఉన్న సీఎం, అయన కుటుంబానికి గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచాన్ని పాండమిక్ ప్రభావం గురించి మరిచి పోయినట్టుంది అంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అంతేకాకుండా కరోనా సంక్షోభంలో కూడా భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే యునికార్న్‌లకు నిలయంగా ఇండియా మారిందని ఆయన అన్నారు. ఈ ఏడాది ఒక్క ఏప్రిల్ లోనే 8.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించబడ్డాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు. ఫామ్‌హౌస్ కుటుంబం నిరంతరం ఏమైనా మాట్లాడవచ్చు కానీ….వాస్తవం గుర్తించాలని ఆయన అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాటికి నిలయం కావడం భారతదేశానికే గర్వకారణమన్న కిషన్ రెడ్డి.. టీకా కవరేజ్ లో, ఆరోగ్య సంరక్షణ కవరేజ్, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ కవరేజీలో అగ్రస్థానంలో భారత్ నిలిచిందన్నారు.