కరోనా తర్వాత ప్రపంచాన్ని అంతలా వణికిస్తున్న మరో మహమ్మారి మంకీపాక్స్. ఇప్పటికే ప్రపంచంలో చాలా దేశాలు ఈ వైరస్ బారినపడ్డాయి. ఇటీవల ఇండియాలో కూడా ఈ మహమ్మారి ఎంటర్ అయింది. కానీ కేంద్ర, రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తం కావడంతో ఇండియాలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి కట్టడిలోనే ఉంది. ఈ వైరస్‌కు వ్యాక్సిన్ కోసం పలు దేశాల పరిశోధకులు, శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో మంకీపాక్స్ వైరస్‌కు వ్యాక్సీనియా వైరస్ (వీఏసీవీ) ఆధారిత టీకాలు సమర్థంగా ముకుతాడు వేయగలవని ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయం పరిశోధకులు తాజాగా నిర్ధారించారు. బలమైన రోగనిరోధక శక్తిని అవి ఉత్పత్తి చేయగలుగుతున్నట్లు తేల్చారు. వ్యాక్సీనియా వైరస్ అనేది పాక్స్ వైరస్ కుటుంబానికి చెందిన ఓ పెద్ద, సంక్లిష్ట వైరస్. దాని ఆధారిత వ్యాక్సిన్లు గతంలో మంకీపాక్స్‌పై సమర్థంగా పనిచేశాయి. కొంతకాలంగా ఎంపీఎక్స్‌వీ-2022 అనే రకం వైరస్ కారణంగా మంకీపాక్స్ వ్యాప్తిచెందుతుండటంతో.. దానిపై వీఏసీవీ టీకాల ప్రభావం ఎంతమేరకు ఉంటుందో పరిశోధకులు పరిశీలించారు. ఎంపీఎక్స్‌వీ-2022ను ఆ టీకాలు సమర్థంగా గుర్తించి, రోగ నిరోధక వ్యవస్థను మెరుగ్గా అప్రమత్తం చేస్తున్నట్లు తేల్చారు.