రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో జరిగిన వైశాలి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. నిన్న పట్టపగలు మిస్టర్ టీ ఓనర్ నవీన్ రెడ్డి ఏకంగా 100 మందితో యువతి ఇంటికొచ్చి నానా హంగామా చేశాడు. యువతి ఇంటి వద్ద ఉన్న కార్లను ధ్వంసం చేసి, అడ్డొచ్చిన యువతీ తల్లిదండ్రులు, బంధువులను కూడా కర్రలతో కొట్టారు. అయితే.. ఈ కిడ్నాప్ కేసు చేధించిన పోలీసులు.. వైశాలిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా వైశాలి మీడియాతో మాట్లాడుతూ.. కిడ్నాప్ చేసేందుకు వచ్చినవాళ్లు తనను చాలా ఘోరంగా ట్రీట్ చేశారని ఆమె ఆరోపించారు. ‘ మా నాన్న ను చంపేస్తామని బెదిరించారు. నవీన్ తో నాకు పెళ్ళి కాలేదు.
ఫోటోలు కూడా మార్ఫింగే. దారుణంగా కొట్టారు. హెల్ప్ అని అరుస్తుంటే గోళ్తో గిచ్చారు. కొరికారు. ఇష్టం లేదని చెప్తున్నా వినిపించుకోలేదు. నీ ఇష్టంతో పని లేదన్నాడు. వేరే వాళ్లను ఎలా పెళ్లి చేసుకుంటావని ఘోరంగా కొట్టాడు. మానాన్న కూడా చిన్నప్పడు నన్ను కొట్టలేదు. కారులో నవీన్‌తో పాటు ఆరుగురు ఉన్నారు. నాతో 10 మంది దారుణంగా వ్యవహరించారు. నా కెరీర్‌ను నాశనం చేశారు. ప్లీజ్.. ప్లీజ్ అంటున్నా కాళ్లు పట్టుకొని లాగారు. మాతో కలిసి నవీన్ బాడ్మింటన్ ఆడేవాడు.. నేనంటే ఇష్టమని చెప్తే పేరంట్స్‌ను అడగమని చెప్పా. నవీన్‌తో పరిచయం ఉంది కానీ.. ప్రేమ లేదు. నవీన్ నాకు ప్రపోజ్ చేస్తే నో చెప్పా. నా పేరుతో నకిలీ ఇన్‌స్టా అకౌంట్‌ను క్రియేట్ చేశారు. వేధిస్తున్నాడని మూడు నెలల క్రితం ఫిర్యాదు కూడా ఇచ్చా. పోలీసులు చర్యలు తీసుకొని ఉంటే నాపై దాడి జరిగి ఉండేది కాదు. కిడ్నాప్ చేసిన నవీన్, అతని ముఠాను కఠినంగా శిక్షించాలి’ అని వెల్లడించింది వైశాలి.