మరోసారి వైసీపీ ప్లీనరీపై మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విమర్శలు గుప్పించారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. బట్రాజు పొగడ్తల సభలాగా వైసీపీ ప్లీనరీ ఉందంటూ విమర్శించారు. అంతేకాకుండా.. అది పార్టీ ప్లీనరీనా లేక విజయమ్మ వీడ్కోలు సభా నా ? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శవాల దిబ్బమీద ఏర్పడిన పార్టీ ప్లీనరీలో విజయమ్మ రాజకీయ భవిష్యత్ కి సమాధి కట్టినట్టేనని, విజయమ్మ ఎప్పుడో పార్టీ నుండి దూరమయ్యారన్నారు. విజయమ్మ తెలంగాణని షర్మిలమ్మకి, కొడుకుకి ఏపీకి అప్పజెబుతారట.. రాజశేఖరరెడ్డి సంపాదించిన ఆస్తులను పంచండి.. అంతేకాని రాష్ర్టాలను పంచే అధికారం ఎవరిచ్చారు అని ఆమె ప్రశ్నించారు. అవకాశం ఉంటే కత్తులు, కటారులు, బాంబులు ముందు పెట్టుకొని శాశ్వత సీఎంగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకొందురేమో అని ఆమె మండిపడ్డారు. నవరత్నాలన్నీ బూటకపు హామీలేనని, దానిపై వైసీపీ ప్రజాప్రతినిధులు ఎవరు బహిరంగ చర్చకు వచ్చినా నేను సిద్ధమని సవాల్ విసిరారు.
ప్లీనరీలో జగన్ మోహన్‌రెడ్డిని పొగడ్డం చంద్రబాబును తిట్టడం తప్పితే ప్రజలకు ఉపయోగపడే తీర్మానాలు ఏమైనా చేశారా అని ఆమె ధ్వజమెత్తారు. సంపూర్ణ మద్య నిషేధం బ్యానర్ ని మద్య నియంత్రణ కిందకి ఎందుకు మారిపోయిందని, ధీరుడు, శూరుడు అంటోన్న జగన్ మోహన్ రెడ్డిని దమ్ముంటే పరదాలు లేకుండా అమరావతిలో తిరగమనండంటూ ఆమె వ్యాఖ్యానించారు. 2 వేల మంది పోలీసులు లేకుండా సెక్రటేరియట్ కి వెళ్ళి సీట్లో కూర్చోమనండని, బీసీ లకి బిస్కెట్లు విసిరి, మిగతావన్నీ రెడ్డి సామాజిక వర్గంకి అప్పజెపితే సామజిక న్యాయం జరిగినట్టా? దిశ చట్టం ఎప్పటికి అమలు చెస్తారో ప్లీనరీ లో చెప్పలేదు అంటూ ఆమె ప్రశ్నలు సంధించారు.