వంగవీటి రాధా రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తాయా

-

ఒకప్పుడు కలిసిమెలిసి తిరిగిన నేతలు ఇప్పుడు కత్తులు దూసుకుంటున్నారు. చాన్స్ ఎక్కడ దొరుకుతుందా సత్తా చూపిద్దామని వ్యూహాలు రచిస్తున్నారు. బెజవాడ పాలిటిక్స్‌లో సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు,మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇద్దరు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో సఖ్యతగా పని చేసిన నేతలే..2009 నుంచి బద్ధ శత్రువుగా మారిపోయారు. బెజవాడ రాజకీయాల్లో తమ ముద్ర చాటుకునేందుకు.. ఒకరిపై ఒకరు పై చెయ్యి సాధించేందుకు వేయని ఎత్తులు.. ఎత్తుగడలు లేవనే చెప్పాలి. కార్పోరేషన్ ఎన్నికల వేళ చిరకాల శత్రువు విష్ణుని దెబ్బ కొట్టేందుకు వంగవీటి రాధా రాజకీయ ఎత్తుగడలు బెజవాడ రాజకీయాల్లో ఆసక్తిరేపుతున్నాయి.

రాజకీయాల్లో ఎవరు.. ఎప్పుడు.. శత్రువులుగా మారతారో.. మిత్రులవుతారో చెప్పలేం. రాధాకృష్ణ తండ్రి వంగవీటి రంగా అనుచరుల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఒకరు. రంగా మరణం తర్వాత వైఎస్‌ అనుచరుడిగా రాజకీయాల్లో పాతుకుపోయారు విష్ణు. ఆ సమయంలో రంగా తనయుడు రాధాకృష్ణ, మల్లాది విష్ణు కలిసి సాగేవారు. 2004లో కాంగ్రెస్‌ నుంచి తొలిసారి బెజవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలిచారు రాధా. అప్పటి వరకు వ్యవహారం బాగానే సాగినా.. ప్రజారాజ్యం రాకతో వీరిద్దరి మధ్యా గ్యాప్‌ వచ్చింది. విభేదాలకు బీజం పడింది.

రాధా పీఆర్పీలో చేరినా.. వంగవీటి రంగా మాత్రం ఎప్పటికీ కాంగ్రెస్‌ వాడేనని బందర్‌రోడ్డులోని రంగా విగ్రహానికి కాంగ్రెస్‌ కండువా కప్పే ప్రయత్నం చేశారు విష్ణు. ఆ సమయంలో విష్ణుపై రాధా వర్గీయులు దాడి చేశారు. 2009లో విజయవాడ సెంట్రల్‌లో విష్ణు కాంగ్రెస్‌ నుంచి, రాధా పీఆర్పీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రాధా ఓడిపోయారు. ఇంతలో పీఆర్పీ కాంగెస్‌లో విలీనం కావడంతో.. తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే ప్రయత్నం చేశారు రాధా. అయితే ఆ ప్రయత్నాలను విష్ణు అడ్డుకున్నారని చెబుతారు. తర్వాతి క్రమంలో రాధా వైసీపీలో చేరడం విష్ణు కూడా వైసీపీలోనే ఉన్నా పొసిగేది కాదు. 2019 ఎన్నికల్లో సెంట్రల్ సీటు విషయంలో ఇద్దరి మధ్యా తగువు రావడంతో రాధా వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకొన్నారు.

తన రాజకీయ ఎదుగుదలకు అడ్డుపడ్డారనో ఏమో.. 2019 ఎన్నికల్లో విష్ణును ఓడించడానికి రాధా చాలానే కష్టపడ్డారట. దీంతో 25 ఓట్ల మెజారిటీతో అతికష్టం మీద విష్ణు గెలిచారని చెబుతారు. చావు తప్పి కన్ను లొట్టపోయినంత పరిస్థితి అయింది. ఇప్పుడు బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లోనూ విష్ణుపై రివెంజ్‌ తీర్చుకోవడానికి ప్లాన్‌ వేశారట రాధా. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 21 మున్సిపల్‌ డివిజన్లు ఉన్నాయి. ఈ 21 చోట్ల టీడీపీ లేదా జనసేన అభ్యర్థులే గెలవాలని అక్కడి వారితో రాధా చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.

టీడీపీ బలమున్న చోట జనసేన, జనసేన బలమున్నచోట టీడీపీ కలిసి పనిచేయాలని.. వైసీపీని ఓడించాలని ఆయన స్పష్టం చేశారట. తాను కూడా టీడీపీతోపాటు అవసరమైన చోట జనసేన తరఫున కూడా ప్రచారం చేస్తానని రాధా హామీ ఇచ్చినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో వంగవీటి రాధా రాజకీయ ఎత్తుగడ ఎంత మేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news