మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య నిప్పులు చెరిగారు. నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసు రోజురోజుకు నీరుగారిపోతోందని ఆరోపించారు. స్థానిక పోలీసుల నుంచి సీబీఐకి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని మండిపడ్డారు. పరిటాల రవి హత్య కేసులో నిందితులు చనిపోయినట్టుగానే వివేకా హత్యకేసులోనూ జరుగుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ ఉనికిని కోల్పోతోందని, అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మలా తయారైందని మండిపడ్డారు వర్ల రామయ్య. వివేకా హత్య కేసులో సీఎం కుటుంబ సభ్యుల హస్తం ఉందని రాష్ట్రం మొత్తం అంటోందన్నారు వర్ల రామయ్య. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కాపాడాలని ఈ సందర్భంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌లను కోరారు వర్ల రామయ్య.