ఏపీలో ముందస్తు ఎన్నికలపై..విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది కాబట్టి వచ్చే ఏడాది మే లేదా అక్టోబర్ మాసాల్లో ‘ముందస్తు’ అసెంబ్లీ ఎన్నికలు జరగొచ్చని ‘ఎన్నికల జ్యోతిష్కుడు’ ఎన్.చంద్రబాబు నాయుడు అమరావతిలో నిన్న జోస్యం చెప్పేశారని ఏద్దేవా చేశారు.
16 నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనుండగా తెలుగుదేశం పార్టీని ఇంత వరకు ‘యుద్ధసన్నదత’ వైపు నడిపిచలేకపోతున్న తండ్రీకొడుకులు తాము కోరుకున్న ఊహాలోకంలో విహరిస్తున్నారు. రాష్ట్ర సర్కారుపై జనంలో పెరుగుతున్న ‘వ్యతిరేకత’ తెలుగు రాజకీయ ‘కురువృద్ధుడు’ చంద్రసేనుడి బుర్రలో పుట్టినదేగాని, ఏ సర్వేలోనూ తేలిన విషయం కాదు. పోనీ ముందుస్తు ఎన్నికలు జరపాలనే ఆలోచన తమకు ఉందని పాలకపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలెవరూ నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్పలేదన్నారు.
మరి ఈ పెద్దాయనకు కలొచ్చిందేమో! ఏ పాలకపక్షమైనా అత్యంత అనుకూల రాజకీయ, సామాజిక, ఆర్థిక వాతారణం సృష్టించుకుని షెడ్యూలు ప్రకారం ఎన్నికలకు వెళుతుంది. అంతేగాని, ప్రతిపక్ష నేత పగలనకా రేత్రనకా కలవరిస్తున్నారు కదా అని అసెంబ్లీని రద్దుచేయించి మధ్యంతర ఎన్నికలు జరిపించదు. ఈ మాత్రం ‘పొలిటికల్ కామన్ సెన్స్’ తెలుగు ప్రజానీకానికి ఉంది. ఈ లెక్కన టీడీపీ అధినేతకు ఈ ఎన్నికల కలవరింతలు ఎందుకో? అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి.