బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర సోమవారం కుత్బుల్లాపూర్ లోని రాంలీలా గ్రౌండ్స్ నుంచి ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వం పై తన పాదయాత్ర ద్వారా సమర శంఖం పూరించిన బండి సంజయ్ మూడవ విడత పాదయాత్రను పూర్తి చేసిన కొద్ది రోజుల్లోనే నాలుగో విడత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం సాగనున్న పాదయాత్రను బండి సంజయ్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కొనసాగించనున్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్లమెంటు స్థానంలో బండి సంజయ్ పాదయాత్ర ఎలా సాగనంది అన్నది రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. అయితే ఉదయం చిట్టారమ్మ ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బిజెపి నాయకులు. అనంతరం రామ్ లీలా గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో విజయశాంతి మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రధానమంత్రి మోడీ పేరు చెబితేనే భయపడి పారిపోయే మీరు ఆయనకు పోటీగా నిలబడతారా? అంటూ ఎద్దేవా చేశారు. బీహార్ సమావేశంలో ప్రధాని పేరు చెబితేనే.. నితీష్ కుమార్ పారిపోయారని, మోడీ అంటే మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, ఇక మీరేం చేస్తారని మండిపడ్డారు. మోదీ తిరిగి ప్రధాని కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.