తెలంగాణ మరో శ్రీలంక కాబోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి. కేసీఆర్ తెలంగాణను ఆగం చేస్తుండు. రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చిండు. తాజాగా తెలంగాణ ఆదాయం పెరుగుతున్నట్లు కేసీఆర్ సర్కార్ చెప్తున్నప్పటికీ.. స్కీమ్‌లు అమలు చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా, నెలనెలా జీతాలు ఇయ్యాలన్నా, చివరికి పాత అప్పులకు వడ్డీలు కట్టాలన్నా మళ్లా అప్పులే చేయాల్సి పరిస్థితి వస్తున్నదని పేర్కొన్నారు.
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల్లో… రూ. 8,578 కోట్ల అప్పు కావాలని రిజర్వు బ్యాంక్‌ను కేసీఆర్ సర్కార్ కోరింది. నెలల వారీగా ఎంతెంత అప్పు కావాలనే ఇండెంట్‌ను ఇటీవలే ఆర్బీఐకి సమర్పించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు రెండు వారాలకోసారి రిజర్వు బ్యాంక్ నిర్వహించే బాండ్ల వేలం ద్వారా ఈ కొత్త అప్పు తెచ్చుకోనుందని వెల్లడించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రూ. 19,500 కోట్ల అప్పు తీసుకుంది. కొత్తగా తీసుకుంటున్న అప్పుతో… ఇది రూ. 28 వేల కోట్లు దాటనుంది. ఎనిమిదేండ్లుగా ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయటంతో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఇలానే ఉంటే ఈ కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని మరో శ్రీలంకలా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. తెలంగాణను ఆగం చేస్తున్న ఈ కేసీఆర్ సర్కార్‌కు తెలంగాణ ప్రజానీకం కచ్చితంగా తగిన బుద్ధి చెప్పడం ఖాయం అని వార్నింగ్ ఇచ్చారు విజయశాంతి.