దళితబంధు..మరో ఇందిరమ్మ ఇళ్ల పథకంగా మారబోతోంది : విజయశాంతి

-

దళితబంధు కూడా మరో ఇందిరమ్మ ఇళ్ల పథకంగా మారబోతోందంటూ కేసీఆర్‌ సర్కార్‌ పై విజయశాంతి ఫైర్‌ అయ్యారు. స్వరాష్ట్రం ఏర్పడితే దళిత ముఖ్యమంత్రి అని ఉద్యమ సమయంలో ఊదరగొట్టిన కేసీఆర్… తాను ముఖ్యమంత్రి అయ్యి దళితుల్ని దగా చేశారని ఆగ్రహించారు. ఆ తర్వాత దళిత, గిరిజన పేదలకు ఉచితంగా మూడెకరాల భూమి ఇచ్చి, బోరు వేయించి మరీ వ్యవసాయం చేసుకునేందుకు టీఆర్ఎస్ సర్కార్ సహకారం అందిస్తుందని చెప్పి ఆ పథకాన్ని కూడా అటకెక్కించారని నిప్పులు చెరిగారు విజయశాంతి. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సవ్యంగా అమలు కాగా… కేసిఆర్ ఏలుబడిలో మాత్రం సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ కేటాయింపులు, కాగితాలకు పరిమితమై పక్కదారి పట్టాయన్నారు.

హుజూరాబాద్ బైపోల్ నేపథ్యంలో దళిత ఓట్లను రాబట్టుకోవడం కోసం దళిత సాధికారతకు టీఆర్ఎస్ సర్కార్ కృషి చేస్తుందని… దళిత అభ్యున్నతికి దళితబంధు పథకాన్ని అమలు చేయబోతున్నమని… ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున నగదు పంపిణీ చేసి, వారు వ్యాపారాల ద్వారా నిలదొక్కుకునేలా చేయాలన్నది పథకం ఉద్దేశమని… మాయమాటలతో ప్రకటన చేశారని సీఎం కేసిఆర్ పై మండి పడ్డారు. అందుకు 2021-22 బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కేటాయించిన్రు… అయితే ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో కాకుండా ముందుగా సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ప్రారంభించి 70 కుటుంబాలకు దళితబంధును అమలు చేశారన్నారు. తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 18వేల కుటుంబాలకు పథకాన్ని వర్తించేలా సన్నాహాలు చేసి ఎన్నికల నేపథ్యంలో లబ్ధిదారుల అకౌంట్‌లో వేసిన డబ్బులు నిలిపి వేసి నాటకాలు ఆడిన్రు. ఎన్నికల కోసమే అక్కడ దళితులందరికీ పథకం ఇస్తే… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితుల పరిస్థితి ఏంటని బీజేపీ పార్టీ నాయకత్వం ప్రశ్నిస్తే… అందుకు రాష్ట్ర నలు దిశల్లోని నాలుగు జిల్లాల్లో నాలుగు ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో నాలుగు మండలాలను ఎంపిక చేసి నిధులు కేటాయించారని తెలిపారు.

ఈ పథకంలో లబ్ధిదారుల ఎంపిక బాధ్యత జిల్లా అధికారులకు అప్పగించడంతో అవకతవకలు, అక్రమాలకు ఆస్కారం ఉండదని… అంతా పారదర్శకంగా జరుగుతుందని భావించారని వెల్లడించారు. కానీ, తాజాగా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను సీఎం కేసీఆర్ తన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అప్పగించి తమ అనుయాయులు, సన్నిహితులకే ముందుగా అవకాశమిచ్చి…. ఇతర పార్టీలకు సానుకూలంగా ఉండే దళిత కుటుంబాలను పక్కనపెట్టేలా చేసి పథకం ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని నిప్పులు చెరిగారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలోనూ ఇలాంటి గలాటానే జరిగి, పెద్దఎత్తున అవినీతికి దారి తీసిందని విజిలెన్స్‌ కమిషన్‌ కూడా తేల్చిందన్నారు. తాజాగా దళితబంధులోనూ ఎమ్మెల్యేలు, మంత్రులకు బాధ్యతలు అప్పగించడంతో ఇది మరో ఇందిరమ్మ ఇళ్ల పథకంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దళిత బంధును రాజకీయ బంధుగా మార్చబోతున్న ఈ దగాకోరు సర్కార్‌ను రానున్న ఎన్నికల్లో ప్రజలు గద్దె దించడం ఖాయమని విజయశాంతి స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news