విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఐదోరోజు కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది.
త్రిపురాత్రయంలో లలితా త్రిపుర సుందరీదేవి రెండో దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో, సకల లోకాతీత కోమలత్వంతో ప్రకాశిస్తుంది. ఈ తల్లి మణిద్వీప నివాసిని. సకల సృష్టి, స్థితి, సంహార కారిణి, శ్రీవిద్యా స్వరూపిణి. ఉపాసకులకు ముఖ్య ఆరాధ్య దేవత. ‘చిదగ్నికుండ సంభూతా’ అని లలితా సహస్రనామం చెబుతోంది. లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం.